Medico Priyanka: మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసిన రాజమండ్రి మెడికో ప్రియాంక..

రాజమండ్రి మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. ఆగస్టు 3న మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంక.. అప్పటి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమె బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రియాంక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Medico Priyanka: మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసిన రాజమండ్రి మెడికో ప్రియాంక..
Doctor Priyanka

Updated on: Aug 09, 2026 | 7:38 PM

నిండు జీవితం బలైపోయింది. కన్నీమిన్నూ కానకుండా, అత్యంత దారుణంగా కారు నడిపిన తాగుబోతుల దాష్టీకానికి ప్రియాంక ప్రాణం గాల్లో కలిసిపోయింది. కార్‌ టైర్‌ మెడ పైనుంచి ఎక్కేయడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయ్యి.. మృత్యువుతో పోరాడి పోరాడి చివరికి ప్రియాంక శ్వాస ఆగిపోయింది. రాజమండ్రి మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. సికింద్రాబాద్‌లో కిమ్స్‌లో చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. ప్రియాంక బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. మ.3:22కి మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఇద్దరు వ్యక్తులు ఆగస్టు 3న రాత్రి మద్యంమత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టారు.. అప్పటినుంచి ప్రియాంక తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. తాగుబోతుల పైశాచికత్వానికి రాజమండ్రిలో గాయపడినప్పటి నుంచి మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. రాజమండ్రిలో చికిత్స అనంతరం.. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అప్పటినుంచి ఆమెకు డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రియాంకకు ఇప్పటికే అప్నియా టెస్ట్ చేయాలని వైద్యులు ప్రయత్నించినా, అందుకు ఆమె శరీరం సహకరించలేదని పేర్కొంటున్నారు. శరీరంలో సోడియం లెవల్స్‌ 16కన్నా తక్కువగా ఉండటం వల్లే ఇది సాద్యం కాలేదన్నారు. ఆమెను ఎలాగైనా కాపాడానికి డాక్టర్లు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరకు ప్రియాంక బ్రెయిన్‌డెడ్‌ తో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

మెడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు విచారం

ప్రియాంక మృతి తీవ్ర విచారం కలిగించింది.. ప్రియాంక మృతికి కారణమైనవారు ఇప్పటికే జైల్లోఉన్నారు.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం.. అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.

మెడికో ప్రియాంక మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైద్యవిద్యార్థిని ప్రియాంక మృతి కలచివేస్తోంది.. ప్రియాంక మృతికి కారణమైనవారిపై కఠిన చర్యలు తప్పవు.. ఇప్పటికే నిందితులను జైలుకు పంపించాం.. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. అని అనిత పేర్కొన్నారు.

వదిలిపెట్టొద్దు..ప్రియాంక తండ్రి వెంకటేష్

ఈ ఉదయం రాజమండ్రి పీఎస్‌కు ప్రియాంక తండ్రి వెంకటేష్ వెళ్లారు. ప్రస్తుతమున్న కేసులో సెక్షన్లు వీక్‌గా ఉన్నాయా, శిక్షలు పడేలా విచారణ జరుగుతుందా అన్నదానిపై ఆరా తీశారు. డీఎస్పీలు దేవరాజ్, సుభాష్‌తో కేసుపై చర్చించారు. ఇది ముమ్మాటికీ మర్డరేనని అన్నారు. తప్పతాగి ఇలాంటి యాక్సిడెంట్స్ చేసేవారిని వదిలిపెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటేష్‌.

ఎస్పీ ఎమన్నారంటే..

ప్రియాంకను యాక్సిడెంట్‌ చేసిన దశ్వంత్‌, ఆండ్రూ జోసెఫ్‌ ఎడ్వర్డ్స్‌పై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశామని తూర్పుగోదావరి జిల్లా SP కిషోర్ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వారిద్దరూ ప్రియాంకను ఢీకొట్టారని తెలిస్తే హత్యాయత్నం కేసును హత్యకేసుగా మారుస్తామని చెప్పారాయన. నిందితులను కస్టడీకి కోరుతున్నామన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ అరెస్టు చేస్తామన్నారు.

అసలేం జరిగిందంటే..

ఈ ఆగస్ట్ 3వ తేదీ రాత్రి.. రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌లో సినిమా చూసి బయటికొచ్చారు ప్రియాంక, ఆమె ఫ్రెండ్. మాల్ నుంచి రోడ్డు మీదకు వెళ్లే సమయంలో కొన్ని క్షణాలు ఆపారు. కారణం.. రోడ్‌పై ట్రాఫిక్ ఉండడం. బట్.. వెనక కారులో ఉన్న నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్.. ప్రియాంక బైక్‌ను ఢీకొట్టారు. మొదట ‘ర్యాష్ డ్రైవింగ్’ కింద సెక్షన్లు పెట్టారు. అది నిర్లక్ష్యం కాదు, తెలిసి ఉద్దేశపూర్వకంగా చంపేందుకు చేసిన ప్రయత్నమని నిర్ధారణ కావడంతో FIRలో కీలక సెక్షన్లను మార్చారు. BNS 125(B) స్థానంలో ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం చేసినందుకు BNS 308, హత్యాయత్నం కింద BNS 110 సెక్షన్లు చేర్చారు. ప్రస్తుతం నిందితులు దుష్యంత్, ఆండ్రూ జోసెఫ్ ఇద్దరూ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో జైలు గోడల మధ్య ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us