
యాంజియోగ్రామ్ అనే పేరును మనం ఆస్పత్రుల్లో వింటూ ఉంటాం. ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు.. ఇతరత్రా గుండె సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతారు. యాంజియోగ్రామ్ గురించి, అది గుండె ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. గుండెపోటు అనుమానం ఉన్నప్పుడు లేదా ఈసీజీ, ఈకో, టీఎంటీ, సిటీ కరోనరీ యాంజియో, ఎంఆర్ఐ వంటి ఇతర పరీక్షలలో గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నట్లు సూచనలు లభించినప్పుడు యాంజియోగ్రామ్ అవసరం అవుతుంది. ఈ ఇతర పరీక్షలు కేవలం సూచనలను మాత్రమే ఇస్తాయి తప్ప, గుండెలో బ్లాక్ ఉందా లేదా అని కచ్చితంగా నిర్ధారించే పరీక్ష యాంజియోగ్రామ్ మాత్రమే.
యాంజియోగ్రామ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది?
యాంజియోగ్రామ్ ప్రక్రియలో, ఒక సన్నని ట్యూబ్ (క్యాథెటర్)ను గుండె రక్తనాళాల్లోకి ప్రవేశపెట్టి, దాని ద్వారా అయోడిన్ కలిగిన ఒక ప్రత్యేక ఇంకును ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఇంకు రక్తనాళాల్లో ప్రవహిస్తున్నప్పుడు, ఎక్స్-రే యంత్రం ద్వారా దాని కదలికను ఒక సినిమా లాగా రికార్డ్ చేస్తారు. దీన్ని “సిని” అని అంటారు. ప్రస్తుతం ఈ రికార్డింగ్‌లు సీడీలు లేదా పెన్ డ్రైవ్‌లలో నిక్షిప్తం చేస్తున్నారు.
శరీరంలోకి ప్రవేశం:
గుండె రక్తనాళాలను చేరడానికి, శరీరంలో ఏ రక్తనాళం గుండా ప్రవేశించినా చివరికి గుండెను చేరుతుందని డాక్టర్లు వివరిస్తున్నారు. సాధారణంగా, మణికట్టులోని “రేడియల్ ఆర్టరీ”ని ప్రవేశ మార్గంగా ఉపయోగిస్తారు. ఇది బొటనవేలు కింద స్పష్టంగా పల్స్ తెలిసే భాగం. కుడి మణికట్టు వైద్యుడికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రేడియల్ ఆర్టరీ ద్వారా రెండు మిల్లీమీటర్ల సన్నటి “షీత్”ను ప్రవేశపెట్టి, దాని ద్వారా సుమారు ఒక మీటరు పొడవు ఉండే క్యాథెటర్‌ను నెమ్మదిగా గుండెకు పంపిస్తారు. ఈ క్యాథెటర్ మణికట్టు నుంచి మోచేయి, భుజం, పక్కటెముకల గుండా ప్రయాణించి గుండెను చేరుకుంటుంది.
బ్లాకుల పరిశీలన:
క్యాథెటర్ గుండె రక్తనాళాల్లోకి చేరిన తర్వాత, ఇంకును ఇంజెక్ట్ చేసి, ఎక్స్-రే మెషీన్ ద్వారా గుండెలోని ఎడమ, కుడి రక్తనాళాలను వివిధ కోణాల నుంచి పరిశీలిస్తారు. కింద నుంచి, పై నుంచి, ఎడమ పక్కన, కుడి పక్కన.. ఇలా అన్ని దిక్కుల నుండి రక్తనాళాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఒకే రక్తనాళాన్ని అనేక కోణాల నుంచి చూడటం వల్ల అందులో ఏమైనా బ్లాకులు ఉన్నాయా అనేది స్పష్టంగా తెలుస్తుంది.
బ్లాకులను ఎలా గుర్తిస్తారు?
పరీక్ష పూర్తయిన తర్వాత, సేకరించిన వీడియోలను విశ్లేషించి బ్లాకులు ఉన్నాయో లేదో నిర్ధారిస్తారు. గుండెకు ఎడమ పక్కన ముఖ్యమైన ధమనిని “లెఫ్ట్ మెయిన్” అంటారు, దీనికి రెండు భాగాలు ఉంటాయి. గుండె ముందు భాగంలో ఉన్న రక్తనాళం గుండెకు దాదాపు 60-65% రక్తాన్ని సరఫరా చేస్తుంది కాబట్టి ఇది చాలా కీలకమైనది. సాధారణ రక్తనాళం ఒకే పరిమాణంలో ఉంటుంది. కానీ, హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు లేదా బ్లాకులు ఉన్నప్పుడు రక్తనాళం సన్నబడి కనిపిస్తుంది. అంతేకాకుండా, సన్నబడిన ప్రాంతంలో తెల్లగా కనిపించే రక్తం గడ్డను కూడా గమనించవచ్చు, ఇది గుండెపోటుకు ప్రధాన కారణం. మైనర్ హార్ట్ ఎటాక్‌లో రక్తనాళం సన్నబడటం, గడ్డకట్టడం కనిపిస్తుంది, అదే మేజర్ హార్ట్ ఎటాక్‌లో రక్తనాళం పూర్తిగా మూసుకుపోతుంది. కుడి వైపు రక్తనాళం అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది.
గుండె ఆరోగ్య ప్రాముఖ్యత:
గుండె అనేది మనిషి పుట్టుకకు ముందే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు 28వ రోజు నుంచే కొట్టుకోవడం ప్రారంభించి, మనిషి చివరి క్షణం వరకు నిరంతరం, అలుపు లేకుండా పనిచేసే అవయవం. గుండె సరిగ్గా పని చేయాలంటే, దానికి రక్తాన్ని సరఫరా చేసే ఈ రెండు ప్రధాన రక్తనాళాలు బ్లాకులు లేకుండా ఉండటం అత్యవసరం. యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా ఈ రక్తనాళాల్లో బ్లాకులు లేవని నిర్ధారిస్తే, ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఈ విధంగా, యాంజియోగ్రామ్ పరీక్ష గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో, సరైన చికిత్సా ప్రణాళికను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: వేసవిలో ఉదయాన్నే ఒక కప్పు.. రోజంతా బాడీ కూల్.. కూల్..