PM Modi: ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. ఆ భవనాల ప్రారంభోత్సవం

| Edited By: Ravi Kiran

Jan 16, 2024 | 1:45 PM

నాసిన్ కేంద్రంలో ప్రధాని మోదీ గంటన్నర పాటు ఉండనున్నారు. భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఐఆర్ఎస్‌కు ఎంపికైన వారితో పాటు ముఖ్య అధికారులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు. ప్రధాని పర్యటించే నాసిన్ కేంద్రంలో కానీ, లేపాక్షి ఆలయంలో కానీ బయట వ్యక్తులు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

PM Modi: ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. ఆ భవనాల ప్రారంభోత్సవం
Pm Modi
Follow us on

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటగా లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నారు. అనంతరం సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర నాసిన్‌ క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ కేంద్రంలో కొత్తగా నిర్మించిన భవనాలను ప్రధాని ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితమే ప్రధాని భద్రతా అధికారులు నాసిన్ కేంద్రాన్ని.. అదే విధంగా లేపాక్షి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

2022లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ముస్సోరిలో శిక్షణ కేంద్రం ఉన్నట్లుగానే.. ఐఆర్ఎస్‌లకు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే నాసిన్ కేంద్రం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశంలో రెండో నాసిన్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేస్తుంది. ఇదే అతిపెద్ద నాసిన్ కేంద్రం. హర్యానాలో ఉన్న నాసిన్ కేంద్రం కేవలం 23 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. సత్యసాయి జిల్లాలో 503 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.

లేపాక్షి విశిష్టలు..

ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మొదట లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడే దాదాపు 45 నిమిషాల పాటు ఉంటారు. లేపాక్షి ఆలయంలో రాముని పాటలతో భజన కార్యక్రమం.. తోలుబొమ్మలాటలను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షిస్తారు. అనంతరం లేపాక్షి నుంచి హెలికాప్టర్ ద్వారా నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధానికి సీఎం జగన్‌, గవర్నర్ నజీర్ స్వాగతం పలుకుతారు.

నాసిన్ కేంద్రంలో ప్రధాని మోదీ గంటన్నర పాటు ఉండనున్నారు. భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఐఆర్ఎస్‌కు ఎంపికైన వారితో పాటు ముఖ్య అధికారులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు. ప్రధాని పర్యటించే నాసిన్ కేంద్రంలో కానీ, లేపాక్షి ఆలయంలో కానీ బయట వ్యక్తులు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

మంగళవారం లేపాక్షిలోని వీరభద్ర ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. తెలుగులో ఉన్న రంగనాథ రామాయణంలోని శ్లోకాలను వింటారు. అయోధ్యలోని రామజన్మభూమి మందిరం ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు కేవలం 6 రోజుల ముందు, రామాయణంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న లేపాక్షిని ప్రధాని మోదీ సందర్శించడం విశేషం. సీతను అపహరించిన రావణుడి చేతిలో తీవ్రంగా గాయపడిన జటాయువు పడిన ప్రదేశం లేపాక్షిగా చెబుతున్నాయి మన పురాణాలు. సీతను రావణుడు దక్షిణానికి తీసుకువెళ్లాడని రాముడికి చెప్పి.. మరణించిన జటాయువు శ్రీరాముడిచే మోక్షాన్ని పొందుతుంది. నాసిక్‌లోని శ్రీ కళా రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన తర్వాత లేపాక్షి పర్యటన జరిగింది. కొద్ది రోజుల క్రితం నాసిక్‌లోని గోదావరి నది ఒడ్డున ఉన్న పంచవటిని ప్రధాని మోదీ సందర్శించిన సంగతి తెలిసిందే.

503 ఎకరాల్లో..

పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో ఈ శిక్షణా కేంద్రాన్ని నిర్మించింది కేంద్రం. ఇది బెంగళూరు విమానాశ్రయం నుంచి గంట ప్రయాణం కావడం విశేషం. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ తరహాలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌(ఐఆర్‌ఎస్‌)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు అధికారులు. ఈ కేంద్రం ఆవరణలోనే సోలార్ సిస్టం, శిక్షణలో భాగంగా అవసరమయ్యే విమానం కూడా ఉన్నాయి. నాసిన్‌ చేరుకోవడానికి ప్రత్యేక రైల్వేలైన్‌ను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక ఈ శిక్షణా కేంద్రంలో పనిచేసే సిబ్బంది పిల్లల కోసం సమీపంలోనే కేంద్రీయ విద్యాలయాన్ని కూడా మంజురూ చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు కూడా స్థలాన్ని ఎంపిక చేసే పనిలో ఉంది రెవెన్యూ శాఖ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి