
కర్నూలు నగరంలో పోలీసుల ఇళ్లలో జరిగిన చోరీ కేసులను ఫోర్త్ టౌన్ పోలీసులు ఛేదించారు. పోలీసుల ఇళ్లే లక్ష్యంగా పగటిపూట చోరీలకు పాల్పడిన ముగ్గురు సభ్యుల ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నేరానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలులోని కోడుమూరు రోడ్డు, శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న ఏపీఎస్పీ రెండో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మహేష్, రిటైర్డ్ ఆర్ఎస్ఐ సుబ్బయ్య ఇళ్లలో ఆగస్టు నెల 23న వరుస చోరీలు జరిగాయి. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించిన నిందితులు.. కారులో అక్కడికి చేరుకుని పగటిపూటే చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అందులో నమోదైన కారు, నిందితుల కదలికల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. చివరకు తెలంగాణకు చెందిన మహమ్మద్ సర్ఫరాజ్, మీర్ కుర్రం అలీ ఖాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు షా నవాజ్ పరారీలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, చార్మినార్ తదితర ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు యువకులు జల్సాలకు అలవాటు పడి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. తెలంగాణలోని సిద్ధిపేట, అడ్డాకుల, రాజేంద్రనగర్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై పది కంటే ఎక్కువ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇక కర్నూలు చోరీల్లో నిందితుల నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు ఉపయోగించిన సామగ్రిని కూడా సీజ్ చేశారు. దొంగిలించిన ఆభరణాలను విక్రయించేందుకు బెంగళూరుకు వెళ్తుండగా నిందితులను పట్టుకున్నట్లు సీఐ వెల్లడించారు.
అయితే పోలీసుల ఇళ్లనే ఎందుకు టార్గెట్ చేశారు? అన్నదానిపై విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు కావడంతో తమ ఇళ్లకు ఎవరూ రాకపోవచ్చని, విధుల్లో ఉండే కారణంగా ఇళ్లు ఖాళీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిందితులు భావించినట్లు సమాచారం. ఈ ఆలోచనతోనే పోలీసుల ఇళ్లను ఎంచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..