
ఆంధ్రప్రదేశ్ దశాబ్దాల కల పోలవరం ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2027 మార్చి నాటికి పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు ఫేజ్1 పూర్తికి గడువును మరో ఏడాది పొడిగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం ఫేజ్-1 పూర్తికి గడువు 2027 మార్చి నాటికి పొడిగించారు. గతంలో 2026 మార్చి నాటికి ఫేజ్ 1 పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇంకా తుది దశలో ఉన్నాయని నిర్మాణ గడువును మరో ఏడాది పొడిగించారు. కేంద్ర సహాయం ఫేజ్ 1కే పరిమితమని, అయితే సివిల్ పనులు ఫుల్ రిజర్వాయర్ లెవల్ 45.72 మీటర్ల వరకు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. పవర్ హౌస్ ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తెలిపారు. ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారం సాగుతున్నాయని, 2027 నాటికి ఫేజ్ 1 పూర్తి చేసి నీరు విడుదల చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కేంద్రం తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను బిల్లుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఈ మేరకు గత ఐదు సంవత్సరాల్లో (2021-26) కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు మొత్తం రూ.12,620.53 కోట్లు విడుదల చేసింది. 2021-22 లో రూ.1,898.80 కోట్లు ,2022-23లో రూ.1,671.23 కోట్లు ,2023-24 లో రూ.727.88 కోట్లు ,2024-25 లో రూ.5,512.40 కోట్లు, 2025-26లో రూ.2,810.22 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇప్పటికే ఫేజ్-1 సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ రూ.12,157.53 కోట్లుగా ఉంది.
పోలవరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. స్పిల్‌వే, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ పనులు దాదాపు పూర్తి దశలో ఉన్నాయి. మిగిలిన కీలక పనులు గ్యాప్-1, గ్యాప్-2 ప్రధాన డ్యామ్ నిర్మాణం, భూసేకరణ, పునరావాసం,కొనసాగుతున్నాయి. స్పిల్‌వే (స్ట్రక్చర్) ఎర్త్‌వర్క్ 96.87 శాతం, కాంక్రీట్ పనులు 98.84 శాతం పూర్తయ్యాయి. స్టీల్ వర్క్ 92.95 శాతం పూర్తయ్యాయి. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ కనెక్టివిటీస్ లో ఎర్త్‌వర్క్ 75.56 శాతం, కాంక్రీట్ వర్క్ 81.99 శాతం, స్టీల్ వర్క్ 81.31 శాతం పూర్తయింది. ఇక ప్రధాన కాలువల ఎర్త్‌వర్క్ 98.96 శాతం, కాంక్రీట్ పనులు 88.44 శాతం, స్టీల్ వర్క్ 55.68 శాతం పూర్తయినట్లుగా కేంద్రం తెలిపింది
పోలవరం నిర్వాసితుల విషయంలో ప్రభావితమయ్యే కుటుంబాల్లో ఇప్పటివరకు 17,892 కుటుంబాల తరలింపు పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు నిర్వాసితుల సంఖ్య 96,660 కుటుంబాలుగా కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద రూ.1,373.01 కోట్లు చెల్లించినట్లు, మొత్తం రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ పనులకు సుమారు రూ.1,581 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్రం ఇచ్చిన ఈ సమాధానం ద్వారా పోలవరం ప్రాజెక్టు పురోగతి, నిధుల విడుదల, నిర్వాసితుల పునరావాసం వివరాలు స్పష్టమయ్యాయి.