
పెనమలూరులో రాజకీయం వేడెక్కింది. పార్థసారధి తీసుకున్న నిర్ణయం ఆ నియోజకవర్గ టీడీపీలో గుబులు రేపింది. దీంతో పెనమలూరు తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ బోడె ప్రసాద్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోడ ప్రసాద్ ఉద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నానని ఈసారి పెనమలూరు సీటు మాదే.. గెలుపు మాదే అన్నారు. నియోజకవర్గ ప్రజలు నాకు తోడుగా ఉంటే ఎక్కడా తగ్గేదే లేదన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తనకు టికెట్ దక్కని కారణంగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. దీనికి కారణం కూడా వెల్లడించారు పార్థసారథి.
గతంలో అర్హత ఉన్నా మంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా టికెట్ విషయంలోనూ తన పేరును ప్రకటించకపోవడంతో పార్టీ మారే అలోచనలో ఉన్నారు పార్థసారథి. త్వరలో తెలుగుదేశం అధినేతతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత మరిన్ని విషయాలు ప్రకటిస్తానన్నారు. ఈ క్రమంలో పెనమలూరు టీడీపీ ఇంచార్జ్ తన సీటుకు ఎక్కడ ఎసరువస్తుందో అన్న భయంతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ముందుగా ‘సీటు నాదే.. విజయం తమదే ఎక్కడా తగ్గేదేలేద’న్నారు. మరి వైసీపీలోని అసమ్మతి టీడీపీకి కూడా పాకుతుందా.. టీడీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..