AP News: ఎర్రమట్టి దిబ్బల చుట్టూ ఏపీ రాజకీయం.. ప్రభుత్వానికి పవన్ 48 గంటల డెడ్‌లైన్

విశాఖపట్నం, భీముని పట్నం మధ్యలో.. విస్తరించి ఉన్న అరుదైన సంపద. ఇప్పటివరకూ పర్యాటకానికి ఫేమస్ అయిన ఈ ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు పాలిటిక్స్‌కి కేరాఫ్‌గా మారాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ అరుదైన వారసత్వ సంపదను ప్రభుత్వం కాపాడాల్సిందిపోయి.. అన్యాక్రాంతం చేసే ప్లాన్ చేస్తోందనేది జనసేన అధినేత ఆరోపణ. ఆ భూములను రక్షించే కార్యాచరణ ప్రకటించాలని డెడ్‌లైన్ కూడా విధించారు పవన్. అయితే అలాంటిదే లేకపోయినా.. ఏదో జరిగిపోతున్నట్టు పవన్ హడావుడి చేస్తున్నాడనేది ప్రభుత్వ వర్గాల వాదన.

AP News: ఎర్రమట్టి దిబ్బల చుట్టూ ఏపీ రాజకీయం.. ప్రభుత్వానికి పవన్ 48 గంటల డెడ్‌లైన్
Pawan Kalyan

Updated on: Aug 16, 2023 | 8:55 PM

ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 16:  విశాఖలో పవన్ పర్యటన హీటెక్కిస్తోంది. రోజుకో అంశాన్ని లేవనెత్తుతూ.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలతో ముందుకు సాగుతున్నారు. రుషికొండ, విసన్నపేటలోని వివాదాస్పద భూములను పరిశీలించిన జనసేనాని.. అక్రమాలు జరుగుతున్నాయంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్కడ జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలపై.. గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చిన పవన్.. ఇప్పుడు బొబ్బిలి రూట్‌లో కాక రేపుతున్నారు. ఎర్రమట్టి దిబ్బల సాక్షిగా.. దుమ్మెత్తిపోస్తున్నారు. భీమిలిలో అత్యంత అరుదైన ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. తమిళనాడు, శ్రీలంక, భీమిలిలో మాత్రమే ఉన్న అరుదైన దిబ్బలవి. గతంలో దాదాపు 1200 ఎకరాల్లో ఉన్న ఈ దిబ్బలు.. ఇప్పుడు 292 ఎకరాలకే పరిమితమయ్యాయి. వీటిని రక్షించాల్సింది పోయి.. ధ్వంసం చేస్తున్నారనేది పవన్ ఆరోపణ. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా అక్కడ లే ఔట్లు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు పవన్.

ఎర్రమట్టి దిబ్బల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు పవన్. ఆసియా మొత్తంలోనే మూడు చోట్ల మాత్రమే ఏర్పడ్డ ఈ ఎర్రమట్టి దిబ్బలు జియో హెరిటేజ్ గుర్తింపు పొందాయనీ.. అలాంటి అరుదైన వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తోంది జనసేన. ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసి.. రక్షణ కల్పించాలనేది జనసేన డిమాండ్. దీనిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే గ్రీన్ ట్రిబ్యూనల్ వరకూ వెళ్తామంటున్నారు. అయితే రాజకీయంగా మైలేజ్ పెంచుకునేందుకే పవన్ హడావుడి చేస్తున్నారనీ.. అక్కడ ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. పవన్ మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరంటున్నారు.

ప్రజా కోర్టు, ప్రజావాణి వంటి పవన్‌ కార్యక్రమాలు సినిమా టైటిల్స్‌, టీవీ సీరియల్స్‌కు పనికొస్తాయి తప్ప జనాలకు వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు వైసీపీ నేత పేర్ని నాని. మొత్తంగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ పర్యటనలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఎర్రమట్టి దిబ్బలపై పవన్ ఆరోపణలు చేయడమే కాకుండా.. డెడ్‌లైన్ విధించడం ఆసక్తికరంగా మారింది. మరి పవన్ కల్యాణ్‌ విధించిన డెడ్‌లైన్‌లోపు ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు ప్రకటిస్తుందా? లేదంటే లైట్ తీసుకుంటుందా అనేది చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..