
పల్నాడు జిల్లా కారంపూడిలో హోంగార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ముళ్ల పొదల్లో శవమై కనిపించాడు. శరీరంపై గాయాలుండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల పాటు సెలవులో ఉన్న హోంగార్డు ఆదివారం రోజు చర్లగుడిపాడు.. జంగమహేశ్వరపురం మధ్య గల జానపాడు దర్గా వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గురజాల మండలం చర్లగుడిపాడుకు చెందిన షేక్ అలేఖ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కారంపూడి పిఎస్ లో విధులు నిర్వహించే హోంగార్డు మూడు రోజుల పాటు సెలవు పెట్టాడు. మృతుడికి వివాహం అయింది. ఇద్దరూ పిల్లలున్నారు. అయితే ఏడేళ్లుగా గురజాలకు చెందిన ఒక ఉద్యోగినితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శనివారం వాకింగ్ కు వెళ్లి వస్తానని చెప్పిన అలేఖ చర్లగుడిపాడు నుండి గురజాల ఆమె ఇంటికే వెళ్లినట్లు తెలుస్తుంది. సాయంత్రం ఇంట్లో నుండి వెళ్లిన అలేఖ తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చింది. ఆదివారం దర్గా పరిసర ప్రాంతాల్లో మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం అలేఖదిగా తేల్చారు.
అయితే, సాయంత్రం వాకింగ్ సమయంలో సోదరితో ఫోన్ మాట్లాడుతుండగానే మాటలు ఆగిపోయాయని ఆమె పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సహజీవనం చేస్తున్న మహిళతో ఏమైనా విబేధాలున్నాయా.. హత్య చేసి పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుదీర్ఘ కాలం పిఎస్ లో పనిచేస్తున్న హోంగార్డు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో హత్య చేశారా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్నది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది.