Godavari Floods : వరద నీటిలో బాధితులు నరకయాతన పడుతున్నారు. ఇళ్లను వదలి వెళ్లలేక, పునరావాస కేంద్రాల్లో ఉండలేక అంతులేని అవేదనలో లంక గ్రామాలవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ, వరద ప్రాంతాల్లో నీరు ఇంకా తగ్గలేదు. లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో, బాధితులు ఇంకా పునరావాస కేంద్రాల్లోనూ, తాత్కాలిక షెల్టర్లలోనూ తలదాచుకుంటున్నారు. వరద తగ్గుముఖం పడుతున్న ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా 31 లంక,తీర గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి తగ్గినా.. సముద్రంలోకి నీటిని వదలటంతో ఉప్పొంగిన వశిష్ఠ గోదావరితో జిల్లాపై పెనుప్రభావం పడింది. దీంతో జిల్లాలోని యలమంచిలి మండలంలో తొమ్మిది, ఆచంట మండలంలో ఐదు, నరసాపురం మండలంలో రెండు గ్రామాలు నీటమునిగాయి. నరసాపురం పట్టణంలోని మూడు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పడవలపైనే రాకపోకలు సాగుతున్నాయి. పొన్నపల్లి వద్ద గోదావరిగట్టుపై 15 మీటర్ల మేర రైలింగ్ కొట్టుకుపోవటంతో… గండిపడుతుందన్న భయంతో ప్రజలు తెల్లవార్లూ జాగారం చేశారు. పాలకొల్లు-నరసాపురం ప్రధాన రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. అటు జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాల్లో 11వేల మంది నిర్వాసితులు తలదాచుకుంటుండగా… అటు ముంపు పల్లెల్లోనే పదివేల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడిచారు.
ఇదిలా ఉంటే, వరద బాధిత ముంపు ప్రాంతాల పునరావాస కేంద్రంలో అధికారులు ఒక బాలుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వరద ముంపు ప్రాంతాలైన కొత్త నవరసాపురం పాత నవరసపురం గ్రామాల పునరావస కేంద్రం స్థానిక మిషన్ హై స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజున నవరసపురం గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలుడు మధు పుట్టినరోజు వేడుకలు అధికారులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం వరద బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. తమ ఇంటి వద్ద ఉంటే పుట్టినరోజు ఘనంగా జరుపుకునే వాళ్ళం అని తల్లితండ్రులు బాలుడుతో అంటుండగా విన్న అధికారులు పునరావాస కేంద్రంలో గ్రామస్తుల సమక్షంలో పుట్టినరోజు నిర్వహించారు.
పునరావసర కేంద్ర ప్రత్యేక అధికారి ఎంపిడిఓ ఆనంద్ కుమార్ అధికారులు బాలుడితో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. దీనితో బాలుడు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి