
ఏపీలో జాతీయ రహదారుల అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త పనులపై కూడా ముందడుగు వేస్తోంది. ఏపీలో వాహనదారుల అవసరాలకు అనుగుణంగా పలు జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. అందులో భాగంగా మరో నేషనల్ హైవేను కూడా మరింతగా విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్దమైంది. అనకాపల్లి నుంచి తూర్పుగోదావరి వరకు ఉన్న జాతీయ రహదారి 16 ప్రస్తుతం నాలుగు లైన్లుగా ఉంది. అయితే దీనిని ఆరు లైన్ల రహదారిగా మార్చేందుకు రెడీ అయింది. అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు వరకు హైవేను ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. 160 కిలోమీటర్ల మేరు విస్తరణ చేపట్టనుండగా.. ఇందుకోసం రూ.3800 కోట్ల వ్యయం కానుంది. విస్తరణలో భాగంగా బైపాస్, అండర్ పాస్, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు.
విస్తరణ పనుల్లో భాగంగా హైవేను ఆరు లైన్ల రహదారిగా మార్చుతారు. ఇక 11 చోట్ల కొత్త ఫ్లైఓవర్లు, మూడు చోట్ల బైపాస్‌లు, ఐదు చోట్ల అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడతారు. ప్రస్తుతం ఈహైవేలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు హైవే విస్తరణకు ఎన్‌హెచ్‌ఏఐ ముందడుగు వేసింది. అనకాపల్లి జిల్లా వడ్డిమెట్ల నుంచి చేపూరు వరకు 7.7 కిలోమీటర్ల బైపాస్ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు. ఇక ఎర్రవరం వద్ద 3 కిలోమీటర్ల మేర మరో బైపాస్‌తో పాటు జగ్గంపేట దగ్గర 10 కిలోమీటర్ల మేర మరో బైపాస్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ హైవేను విస్తరించాలని ఎన్‌హెచ్‌ఏఐకు స్ధానిక ఎమ్మెల్యేల నుంచి వినతులు పలుమార్లు వెళ్లాయి. దీంతో అధికారులు స్పందించి ఆరు లైన్లుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేషనల్ హైవే విస్తరణతో విజయవాడ, విశాఖపట్నం వెళ్లేవారికి ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. దీని వల్ల వేగవంతం, సౌకర్యవంమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. హైవే పనుల్లో భాగంగా తేటగుంట క్రాస్ రోడ్డు, అన్నవరంలో ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఉండనున్నాయి. ఇకప్రతిపాడు అండస్ పాస్ విస్తరించనున్నారు. అలాగే జెడ్ రంగంపేట దగ్గర అండర్ పాస్ నిర్మించనున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వాహనదారుల కోసం సర్వీస్ రోడ్లు కూడా ఉండనున్నాయి.