గుడ్ న్యూస్.. హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణపై కీలక అప్‌డేట్

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి NH-65ని ఆరు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టుకు కీలక అనుమతి లభించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య అప్రైజల్ కమిటీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దాదాపు 284 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12 వేల కోట్లు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తుది ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.

గుడ్ న్యూస్..  హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణపై కీలక అప్‌డేట్
Nh65 Expansion

Updated on: Sep 01, 2026 | 11:46 AM

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి NH-65ని ఆరు వరుసలుగా విస్తరించే బృహత్తర ప్రాజెక్టుకు కీలక అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య అప్రైజల్ కమిటీ (PPPAAC) ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సమర్పించిన ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. ఇక ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) తుది ఆమోదం వస్తే ఈ ప్రాజెక్టు అధికారికంగా మంజూరైనట్లే. ఈ నెలలోనే ఆ అనుమతి లభించే అవకాశం ఉందని NHAI వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో అత్యంత రద్దీ రహదారుల్లో ఒకటైన హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి NH-65 విస్తరణకు మార్గం సుగమమవుతోంది. మొత్తం 284 కిలోమీటర్ల నిడివిగల ఈ రహదారిని మూడు ప్యాకేజీలుగా విస్తరించేందుకు NHAI ప్రతిపాదనలకు PPPAAC ఆమోదం తెలిపింది. ఇందులో హైదరాబాద్ శివారు మల్కాపూర్ నుంచి విజయవాడలోని గొల్లపూడి బైపాస్ వరకు 226 కిలోమీటర్ల నాలుగు వరుసల హైవేని ఆరు వరుసలుగా విస్తరిస్తారు. ఈ భాగాన్ని హైదరాబాద్ నుంచి నందిగామ వరకు ఒక ప్యాకేజీగా, నందిగామ నుంచి గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ వరకు మరో ప్యాకేజీగా పనులు చేపడతారు. దీనిని బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (BOT) విధానంలో నిర్మించి, నిర్వహించి, బదలాయించు పద్ధతిలో విస్తరిస్తారు.

విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హైవే విస్తరణలో భాగంగా కానూరు సిద్ధార్థ కళాశాల నుంచి దావులూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) క్రాస్ అయ్యే ప్రాంతం వరకు 14 కిలోమీటర్లలో ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసలకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. ORR క్రాసింగ్ ప్రాంతం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న 44 కిలోమీటర్లు ఆరు వరుసలుగా విస్తరిస్తారు. ఈ భాగాన్ని ఒకే ప్యాకేజీగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపడతారు. హైదరాబాద్-విజయవాడ మధ్య 226 కిలోమీటర్లు, విజయవాడ-మచిలీపట్నం మధ్య 58 కిలోమీటర్లు కలిపి మొత్తం 284 కిలోమీటర్ల విస్తరణ ప్రాజెక్టుపై ఆగస్టు 8న PPPAAC భేటీ జరిగింది. గతంలో లేవనెత్తిన అభ్యంతరాలకు NHAI ఇచ్చిన వివరణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టుకు PPPAAC తాజా ఆమోదం తెలిపింది. భూసేకరణ, నిర్మాణ వ్యయం అన్నింటికి కలిపి రూ.12 వేల కోట్ల అంచనాలకు PPPAAC ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు CCEA ముందుకు వెళుతుంది. భారీ ప్రాజెక్టులకు ఈ కమిటీయే తుది ఆమోదం తెలపాలి. అది వచ్చాక ప్రాజెక్టుకు భూసేకరణ, ప్యాకేజీల వారీగా టెండర్లు పిలవడం వంటి ప్రక్రియ మొదలు కానుంది. తొలుత హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హైవేని అమరావతి ORR క్రాస్ అయ్యే కంచికచర్ల వరకే 198 కిలోమీటర్లు విస్తరించేలా ప్రతిపాదించారు. అయితే, దీనిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు. కంచికచర్ల వద్ద ఆపేయకుండా గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ క్రాస్ అయ్యే వరకు విస్తరించాలని కోరారు. దీంతో విజయవాడ బైపాస్ వరకు 226 కిలోమీటర్ల విస్తరణతో డీపీఆర్ సిద్ధం చేశారు.

అయితే, కొన్ని ప్రతిపాదనలను PPPAAC తిరస్కరించింది. గొల్లపూడి నుంచి భవానీపురం మీదుగా వచ్చే హైవే నాలుగు వరుసలుగా ఉండగా అది రద్దీగా మారే అవకాశం ఉండటంతో దాన్ని విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దీంతో గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ నుంచి భవానీపురంలో కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు 5 కిలోమీటర్ల మేర హైవేను కూడా ఆరు వరుసలుగా విస్తరించేలా ప్రతిపాదన వచ్చింది. అంటే మొత్తం 231 కిలోమీటర్లు విస్తరించాలి. కానీ PPPAACలో మాత్రం ఈ చివరి 5 కిలోమీటర్లకు అనుమతివ్వలేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ బైపాస్ వరకే 226 కిలోమీటర్ల విస్తరణకు ఆమోదం తెలిపారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హైవే విస్తరణలో భాగంగా బెంజ్ సర్కిల్ నుంచి ఈడుపుగల్లు కూడలి వరకు ఆరు వరుసల రహదారితో కూడిన పైవంతెనకు ప్రతిపాదన వచ్చినా, పీపీపీఏసీ దీనికి కూడా ఆమోదం తెలపలేదు. కానూరు నుంచి దావులూరు టోల్ ప్లాజా దాటాక ORR క్రాస్ అయ్యే చోట వరకు నాలుగు వరుసలుగానే హైవే ఉండనుంది. కొత్తగా దానికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. ORR క్రాసింగ్ ప్రాంతం నుంచి మచిలీపట్నం వరకే ఆరు వరుసలుగా హైవే విస్తరించే ప్రాజెక్టుకు PPPAAC పచ్చజెండా ఊపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us