
నా ఓటు నోటుకు కాదు అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఓటరు తన నిజాయితీని చాటుకున్నాడు. ఎన్నికల్లో డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టే అభ్యర్థులకు గట్టి గుణపాఠం చెబుతూ, పవిత్రమైన ఓటు విలువను ప్రజాస్వామ్య వ్యవస్థకు మరోసారి గుర్తుచేశాడు. బ్యాలెట్ బాక్స్‌లో డబ్బుతో పాటు ఓ చీటీ వేసి తన నిరసనను తెలిపిన ఆ ఓటరు తీరు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. పలమనేరు రూరల్ పరిధిలోని మురం గ్రామంలో ఇటీవల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓ ఓటరు పోలింగ్ బూత్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పలమనేరు డిగ్రీ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌ను తెరవగా, అందులో కనిపించిన దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆ ఓటరు బ్యాలెట్ పేపర్‌తో పాటు రెండు రూ.500 నోట్లను, ఒక కాగితంపై రాసిన సందేశాన్ని బ్యాలెట్ బాక్స్‌లో వేశాడు. అయ్యా.. మీరిచ్చిన డబ్బు రూ.1000 మీరే తీసుకోండి. నేను డబ్బు తీసుకుని ఓటు వేయను. ధన్యవాదాలు అని ఆ చీటీలో రాసి ఉంది. ఈ చీటీని, నోట్లను పరిశీలించిన పోలింగ్ అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోవడంతో పాటు, విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
ఓటుకు నోటును తిరస్కరించిన ఆ ఓటరు చర్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో కొనియాడారు. నోట్లకు ఓటును తాకట్టు పెట్టని ఆ ఓటరు నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలపై అతనికున్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చిన అభ్యర్థికి తగిన గుణపాఠం చెప్పినట్లయిందని తెలిపారు.
డబ్బు తీసుకుని ఓటేస్తే ఐదేళ్ల పాటు ప్రశ్నించే హక్కును కోల్పోతామని ఆ ఓటరు చాటిచెప్పాడు. అభ్యర్థులు ఇచ్చే నోట్ల కంటే ఓటరు తెలివైన నిర్ణయమే గొప్పదని నిరూపించిన ఈ సాహసోపేత ఘటన ప్రతి ఓటరుకు కనువిప్పు కలిగించేలా ఉందని, ఓటర్లలో చైతన్యానికి ప్రతీకగా నిలిచిందని సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.