
అగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన మురాసు తుఫాన్ తాజాగా తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదిలింది.. ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు-ఆగ్నేయంగా 290 కిమీ, కావలికి 310 కిమీ, ఒంగోలుకు 330 కిమీ, మచిలీపట్నానికి 320 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది
ఈరోజు (నవంబర్ 2) అర్ధరాత్రి 11:30 గంటల నుండి మంగళవారం (నవంబర్ 3) తెల్లవారుజామున 4:00 గంటల మధ్య నెల్లూరు – నరసాపురం మధ్య ఒంగోలుకు అత్యంత సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయియని.. కొన్ని సమయాల్లో ఇవి గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చుని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు హెచ్చరిక.
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
ఈ తుఫాన్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా ఈ రోజు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఏలూరు, తూగో, పగో, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
ఇదిలా ఉండగా మురసు తుఫాను నేపథ్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు ఆయా జిల్లా కలెక్టర్లు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తుఫాను ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.