కొద్దిరోజుల క్రితం జనసేన పార్టీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ చెప్పు చూపించారు. పెళ్ళిళ్ల ప్రస్తావన తీసుకురావొద్దని వైసీపీ నేతల్ని హెచ్చరించారు. దీనికి కౌంటర్‌గా మాజీ మంత్రి పేర్ని నాని రెండు చెప్పులు చూపించారు. ప్రజల్ని నమ్ముకుంటేనే అసెంబ్లీకి వెళ్తారని.. పక్క పార్టీ నేతల్ని నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేవని హితవు పలికారు. ఆ తర్వాత చెప్పు రాజకీయం ఏపీని హీటెక్కించింది.
మళ్లీ చాలా రోజుల తర్వాత పొలిటికల్ తెరపై చెప్పు ప్రత్యక్షమైంది. అది కూడా ఎంపీ మార్గాని భరత్ చేతిలో. రాజమండ్రి సిటిలో జరిగిన సిద్ధం సభలో చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారాయన. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి మార్గాని ఇచ్చిన వార్నింగ్ ఇది. మహిళా వాలంటీర్‌ను బెదిరించారని ఆడియో వినిపించి మరీ చెప్పు చూపించారు.
ఏపీలో లక్షలాది మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్లంతా కాబోయే లీడర్లు అన్నది వైసీపీ నేతల మాట. అంతేకాదూ.. ప్రజలకు సేవ చేసే సైనికులు.. పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు అంటూ సందర్భం వచ్చిన ప్రతీసారి కొనియాడుతూనే ఉన్నారు. అంతలా అభిమానం చూపించే వాలంటీర్లపై ఎవరేమైనా ఆరోపణలు చేస్తే ఏమాత్రం సహించడం లేదు. ఎదురుదాడికి దిగుతూనే ఉన్నారు.