AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన తల్లి.. దర్యాప్తులో బయటపడిన భయంకర నిజం!

కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. కానీ దర్యాప్తులో బయటపడిన నిజాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. పూర్తి వివరాలు కథనంలో ..

కొడుకు కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన తల్లి.. దర్యాప్తులో బయటపడిన భయంకర నిజం!
Gangamma
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jun 03, 2026 | 1:21 PM

Share

కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాలు గ్రామానికి చెందిన చిన్నమల్లయ్య, గంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం చిన్నమల్లయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అనంతరం గంగమ్మకు బంధువైన దర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దర్గప్ప తరచూ ఇంటికి రావడాన్ని గంగమ్మ పెద్ద కుమారుడు వీరేశ్ (17) తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ఈ విషయంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. వీరేశ్ తమ సంబంధానికి అడ్డుగా మారాడని భావించిన గంగమ్మ, దర్గప్ప కలిసి 2024 నవంబరులో ఇంట్లోనే అతన్ని కత్తితో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి బైక్‌పై తీసుకెళ్లి సమీప శ్మశానవాటికలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

హత్య చేసిన తర్వాతే గంగమ్మ తన కుమారుడు కనిపించడం లేదంటూ 2024 నవంబర్ 11న కౌతాళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసును పోలీసులు ఛేదించలేకపోయారు. ఇదే సమయంలో అదృశ్య కేసుల్లో ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందన్న ఆశతో గంగమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. తన కుమారుడి ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె కోర్టుకు తెలిపింది.

ఈ పిటిషన్‌ను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. దీంతో గుంటూరు సీసీఎస్ అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీ రవికుమార్ తదితరులతో సిట్ ఏర్పాటు చేశారు. రెండు వారాల పాటు సాగిన విచారణలో గంగమ్మ, దర్గప్పలే వీరేశ్‌ను హత్య చేసినట్లు తేలింది. పోలీసులు ఆదివారం జి.హొసళ్లి సమీపంలోని శ్మశానవాటికలో పాతిపెట్టిన అస్థిపంజరాన్ని వెలికితీశారు. అక్కడ లభించిన తాడు, టవల్, దుప్పటిని చూసి కుటుంబ సభ్యులు అవి వీరేశ్‌వేనని గుర్తించారు. అస్థిపంజరం నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.

అయితే కేసు మరో మలుపు తిరిగింది. విచారణ కొనసాగుతుండగానే గంగమ్మ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ముందుగా ఆదోని ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు చెబుతున్నారు. అయితే గంగమ్మను విచారణ కోసం పోలీసులు తీసుకెళ్లిన తర్వాతే ఆమె మరణించిందని, ఇది సహజ మరణమా లేక మరేదైనా కారణమా అనే అనుమానాలు గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. సహజ మరణమే అయితే పోలీసు బందోబస్తు మధ్య హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నిస్తున్నారు.

గంగమ్మ మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. మరోవైపు వీరేశ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్గప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గంగమ్మ మరణంపై స్పష్టత రావాల్సి ఉండగా, ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us