ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజురోజుకు మారుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. తాజాగా పర్యాటక శాఖ మంత్రి రోజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పర్యాటక రంగంలో ఏపీని వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. భవానీ ద్వీపంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాకారులతో కలిసి కోలాటం ఆడారు. మట్టి కుండలు తయారు చేశారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి రోజా అన్నారు. 2023 నూతన సంవత్సర వేడుకలను కూడా మొదటిసారి భవానీ ద్వీపంలో చేశామన్న ఆమె.. భవానీ ద్వీపానికి వస్తే సొంతూరికి వచ్చిన భావన కలుగుతోందన్నారు.
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. పవన్ కళ్యాణ్ వారాహితో వచ్చినా, నారా లోకేశ్ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పాదయాత్రలు చేస్తే బరువు తగ్గడం తప్ప ప్రయోజనం లేదు.
– మంత్రి రోజా
మరోవైపు.. కొద్ది రోజుల క్రితం సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలన్నారు. చంద్రబాబు రోడ్ షో లలో 11మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని బాలకృష్ణ ఎమర్జెన్సీ అనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. బాలకృష్ణకు ప్రజల కష్టాలు తెలియదా అని నిలదీశారు. ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి వారి డబ్బుతో మేడలు కట్టుకుని ఆ ప్రజలు చనిపోతే మాట్లాడరా అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..