
రాళ్లతో నిండిన నేలలో రతనాలు పండించడం అంటే ఇదేనంటున్నారు ఔత్సాహిక మహిళా రైతులు. సంప్రదాయ వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో వినూత్నంగా ఆలోచించిన వారు.. ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పండే ఖర్జూర సాగును తెలుగు నేలపై ప్రయోగాత్మకంగా చేపట్టి ఔరా అనిపిస్తున్నారు. మార్కాపురం మండలం నాయుడుపల్లి గ్రామంలోని పొలాలు చిన్నచిన్న రాళ్లతో నిండి ఉంటాయి. ఇసుక మచ్చుకైనా కనిపించదు. సాధారణ వ్యవసాయ పంటలను పండించడం కూడా ఇక్కడ రైతులకు సవాలే. అయితే, ఆ ప్రతికూల పరిస్థితులనే అవకాశంగా మలుచుకున్నారు ముగ్గురు మహిళా రైతులు. నీటి అవసరం తక్కువగా ఉండే ఎడారి పంట ఖర్జూర సాగుపై దృష్టి సారించారు. తమ ప్రాంతంలో తొలిసారిగా ఎకరం పొలంలో సుమారు 110 ఖర్జూరపు మొక్కలను నాటారు. మహిళా రైతులు లక్ష్మి, నాగలీలతో పాటు మరో రైతు ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
కడప ప్రాంతం నుంచి ఖర్జూరపు మొక్కలను తీసుకొచ్చి మూడేళ్ల క్రితం నాటారు. ప్రస్తుతం అవి బాగా ఎదిగి పెద్దవవుతున్నాయి. మరో రెండు, మూడు సంవత్సరాల్లో తొలికాపు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత సరైన సంరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటిస్తే ప్రతి ఏటా స్థిరమైన ఆదాయం పొందవచ్చని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖర్జూర సాగుపై రైతుల ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. పల్నాడు, అనంతపురం, చిత్తూరు, నంద్యాల జిల్లాలతో పాటు తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన పలువురు రైతులు ఇప్పటికే ఖర్జూర సాగును చేపట్టి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలు, నీటి లభ్యత తక్కువగా ఉన్న పొలాలను ఎంచుకుని ఉద్యానవన సాగు తరహాలో ఖర్జూర తోటలను పెంచుతున్నారు. దిగుబడి, లాభాలు ఆశాజనకంగా ఉండటంతో ఇతర ప్రాంతాల రైతులు కూడా ఈ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
సాధారణంగా ఎకరానికి సుమారు 75 నుంచి 110 వరకు ఖర్జూర మొక్కలను నాటేందుకు అవకాశం ఉంటుంది. దిగుబడి ప్రారంభమైన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ఖర్జూరాలను రవాణా చేస్తున్నారు. నాణ్యతను బట్టి కిలోకు రూ.100 నుంచి రూ.180 వరకు ధర లభించే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. రాళ్ల నేల.. నీటి కొరత.. ప్రతికూల వాతావరణం.. అయినా వినూత్న ఆలోచనతో ఖర్జూర సాగును విజయవంతం చేసే దిశగా మహిళా రైతులు చేస్తున్న ఈ ప్రయత్నం.. ఇతర రైతులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.