
వారంతా ఇంటి నిర్మాణ పనులు చేసుకునే.. బేల్దారి కూలీలు.. వీరికి ఓ పూజారి తోడవడంతో పనులు మానేసి పగలు దేవాలయాల్లో భక్తులుగా చలామణి అవుతూ రాత్రిళ్ళు అదే దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు.. ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్నట్టు నటిస్తూ దేవాలయాల్లో పూజలు కూడా చేసేవాళ్ళు.. పూజలు చేసే సమయంలో భక్తులుగా చలామణి అవుతూ దేవాలయం రూపు రేఖలను పరిశీలించి రెక్కీ చేసేవాళ్ళు.. అనంతరం అనువైన సమయం చూసుకుని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు.
మార్కాపురం జిల్లాలోని పలు దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న 13 మందిని అరెస్ట్ చేసి నిందితులను నుంచి 22 లక్షల 70 వేల రూపాయల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. మార్కాపురం జిల్లా సియస్ పురం, పామూరు, కనిగిరి, కొనకనమెట్ల మండలాల్లో పలు దేవాలయాలలో ఇటీవల వరుస చోరీలు జరుగుతున్న నేపధ్యంలో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
ఇటీవల కాలంలో మార్కాపురం జిల్లా పరిధిలోని సి.ఎస్.పురం, పామూరు, కనిగిరి, కొనకనమిట్ల మండలాల్లోని పలు దేవాలయాలలో వరుసగా చోరీలు జరిగాయి. ఈ వరుస చోరీలకు పాల్పడుతున్నది ఒకే ముఠాలోని సభ్యులుగా గుర్తించిన పోలీసులు నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్‌పిగా ఉన్న హర్షవర్ధన్ రాజు ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎస్‌పి నిరంతర పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కనిగిరి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పామూరు సీఐ వినోద్ కుమార్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, సి.ఎస్.పురం, వెలిగండ్ల, పామూరు, కొనకనమిట్ల, పిసీ పల్లి పోలీస్ స్టేషన్ల ఎస్ఐ లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసులను వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను సేకరించి, ఆయా గ్రామాల్లో ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా అందిన విశ్వసనీయ సమాచారాన్ని విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో పామూరు మండలం రావిగుంటపల్లి గ్రామ శివారులో దేవాలయల్లో చోరీలకు పాల్పుడిన 13 మంది నిందితులను అరెస్టు చేశారు.
నిందితులంతా ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా పగలు బేల్దారు పనులు, స్లాబ్ మిల్లర్ పనులు చేస్తూ ఉంటారు. పగలు బేల్దారి పనులు చేసుకుంటూ రాత్రిళ్ళు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. వీరిలో విష్ణువర్ధన్ ఒక ప్రైవేట్ వెంచర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా, అతనికి సుబ్బారావు తోడుగా ఉండేవాడు. వీరిలో పాత నేరస్తుడైన సోమేపల్లి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఒక దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ, దేవాలయాల్లో చోరీలకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించవచ్చనే సలహాలు ఇచ్చేవాడు. కొమరోలు మండలానికి చెందిన బాల గురవయ్య చోరీ చేసిన సొత్తును స్వీకరించే రిసీవర్‌గా ఉండేవాడు. ఈ విధంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు దేవాలయాలను ముందుగా గుర్తించి, అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ రెక్కీలు చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు తెలిపారు. నిందితుల నుంచి 22 లక్షల 70 వేల రూపాయల విలువైన నగలు, విగ్రహాలు, రెండు కార్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.