పుల్లలచెరువు ఈదురుగాలుల బీభత్సం: విద్యుత్ టవర్ నేలమట్టం, అరటి, మిర్చి రైతులకు భారీ నష్టం

మార్కాపురం జిల్లా, పుల్లలచెరువు మండలాన్ని ఈదురుగాలులతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. మురికిమళ్ళ తండాలో 220KV విద్యుత్ టవర్ కూలి, పలుచోట్ల కరెంట్‌ స్తంభాలు నేలకూలాయి. అరటి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది, రైతులు లక్షలు కోల్పోయారు. ప్రభుత్వ పరిహారం కోసం వేడుకుంటున్నారు. అయితే, చెరువులు నిండటంతో భూగర్భ జలాలు పెరగడం ఊరట.

పుల్లలచెరువు ఈదురుగాలుల బీభత్సం: విద్యుత్ టవర్ నేలమట్టం, అరటి, మిర్చి రైతులకు భారీ నష్టం
Markapuram Storm Devastation

Edited By:

Updated on: Sep 16, 2026 | 6:15 PM

మార్కాపురం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ టవర్లు, కరెంట్‌ స్థంభాలు, చెట్లు నేలకూలాయి. పుల్లలచెరువు మండలం మురికిమళ్ళ తండాలో గంట పాటు భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పొలంలోని 220 కెవి విద్యుత్ టవర్ విరిగి పడింది. ఆ పొలంలో అప్పటి వరకు నలభై మంది కూలీలు పని చేస్తూ ఉన్నారు. జోరుగా వర్షం పడుతుండటంతో పనులు ఆపేసి ఇళ్ళకు వెళ్ళి పోయారు. కూలీలు వెళ్ళిన కొద్ది సేపటికి భారీ విద్యుత్‌ టవర్‌ నేలకూలింది. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని రైతు బాలు నాయక్ తెలిపారు. భారీ విద్యుత్ టవర్ కూలిపోవడంతో పొలంలోని మిర్చి మొక్కలు పాడై పోయాయి. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, స్తంభాలు పడిపోయాయని రైతు వాపోయాడు. తనకు జరిగిన నష్ పై అధికారులు స్పందించి న్యాయం చెయ్యాలని రైతు బాలు నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మరోవైపు పుల్లలచెరువు మండలంలో రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి అరటి, మిర్చి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పుల్లలచెరువు లో వర్షం తోపాటు భారీగా వీచిన ఈదురు గాలులకు అనేక ఎకరాలలో అరటి చెట్లు నేలకు విరిగి పడ్డాయి. పొలాల్లో నీళ్ళు నిలబడి మిర్చి మొక్కలు మునిగి పోయాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. చేతికి అంది వచ్చిన అరటి పంట ఈదురు గాలుల ధాటికి చెట్లు ఇరిగిపోవడంతో భారీగా నష్టం వాటిల్లిందంటున్నారు. గత సంవత్సరం ధరలేక నష్టం జరిగితే ఇప్పుడు అకాల వర్షంతో నష్ట పోయామని అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. తెల్లగట్ల వద్ద భారీ వర్షానికి కాలువ కట్టలు తెగిపోయి మిర్చి పొలాలు నీట మునిగాయి. వ్యవసాయ శాఖ అధికారులు పొలాలకు వచ్చి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. మరోవైపు భారీగా కురిసిన వర్షం ధాటికి పుల్లలచెరువు లోని రెండు చెరువులు జలకళ నిండుకోవడంతో భూగర్భ జలాలు పెరిగి తాగు సాగు నీటికి ఇబ్బందులు ఉండవని ప్రజలు భావిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us