పండుగపూట దారుణం.. ఇద్దరు చిన్నారులకు నిద్రమాత్రలు ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం!

మచిలీపట్నంలో కుటుంబ కలహాలతో స్టాఫ్ నర్స్ రేఖ తన ఇద్దరు చిన్నారులకు నిద్రమాత్రలు ఇచ్చి, తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన స్థానికంగా కలకలం రేపింది. పిల్లలు, తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేఖ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, కుటుంబ కలహాలే కారణమా అని దర్యాప్తు చేస్తున్నారు.

పండుగపూట దారుణం.. ఇద్దరు చిన్నారులకు నిద్రమాత్రలు ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం!
Machilipatnam Tragedy

Updated on: Oct 18, 2026 | 7:19 AM

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులకు నిద్రమాత్రలు ఇచ్చిన ఓ స్టాఫ్ నర్స్.. తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రేఖ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె మచిలీపట్నంలోని మల్కాపట్నంలో నివాసం ఉంటున్నారు. కుటుంబంలో నెలకొన్న విభేదాల కారణంగా మనస్తాపానికి గురైన రేఖ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

శనివారం (అక్టోబర్ 17) రాత్రి ఆమె భర్త శ్రీకాకుళం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రేఖ తన భర్తను మచిలీపట్నం రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి రైలు ఎక్కించినట్లు సమాచారం. అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన ఆమె.. తన ఇద్దరు ఆడపిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చి, తాను కూడా మాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. భర్త పుట్టింటికి వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

విషయం గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రేఖతో పాటు చిన్నారుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. రేఖ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us