
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మద్యం బాటిళ్లు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆధ్యాత్మికతకు నిలయమైన ఈ క్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు.
శ్రీశైలం క్షేత్రంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు, సిద్దరమప్ప కాంప్లెక్స్, మాణిక్యమ్మ షేల, సులభ కాంప్లెక్స్ వంటి కీలక ప్రాంతాల్లో అబ్కారీ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఊహించని విధంగా భారీ మొత్తంలో మద్యం పట్టుబడింది. 314 క్వాటర్ బాటిళ్ల మద్యం, 24 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు కొంతకాలంగా ఆత్మకూరు నుండి గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని శ్రీశైలానికి తరలిస్తున్నారు. ప్రధానంగా క్షేత్రంలోని ‘బెగ్గర్స్ హోటల్’లో పనిచేసే సిబ్బందికి, మరికొందరు స్థానికులకు ఈ మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ ఆత్మకూరు నుంచి మద్యం తీసుకురావడం, విక్రయాలు ముగిసిన తర్వాత తిరిగి వెళ్లిపోవడం వీరు పరిపాటిగా మార్చుకున్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రం ప్రశాంతతకు, ఆచారాలకు భంగం కలిగించేలా వ్యవహరించిన సదరు ఐదుగురు మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారిని రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న శ్రీశైల క్షేత్రంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఏమాత్రం సహించబోమని, నిఘాను మరింత తీవ్రం చేస్తామని” అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో శ్రీశైలంలోని ఇతర వ్యాపారులు, అక్రమ విక్రయదారుల్లో వణుకు మొదలైంది. పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడటంలో పోలీసులు తీసుకున్న ఈ సత్వర చర్యను భక్తులు అభినందిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..