
పశ్చిమగోదావరి జిల్లా, ఆక్టోబర్ 02: ఆ మాజీ మంత్రి.. వద్దంటే ఆ పార్టీల వెంట పడుతున్నారా? ఆ రెండుపార్టీల్లో వేకెన్సీ లేదని తెలిసినా ఛాన్స్ కోసం తహతహలాడుతున్నారా. ఆయన ఎంతగా పూసుకుంటున్నా, రాసుకుంటున్నా ఎందుకు ఆ పార్టీలు పట్టించుకోవటం లేదు. ఒకపుడు ఏపీ రాజకీయాల్లో కీలక నేత ఇప్పుడెందుకింత బేలగా మారారు? బ్యాడ్ టైం నడుస్తోందా? ఈక్వేషన్స్ కోసం వెయిటింగా? వాట్స్ హ్యాపెనింగ్?
పశ్చిమగోదావరి జిల్లాలో అవినీతి మరక అంటని సీనియర్ నాయకుడిగా కొత్తపల్లి సుబ్బారాయుడికి పేరుంది. రాజకీయాలలో ఆయన రూటే సెపరేటు. తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్ నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో సొంత గూటిని వదిలి చిరంజీవి చెంతకు చేరారు. తర్వాత ఆయనతో పాటే కాంగ్రెస్‌లోకొచ్చారు. అక్కడినుంచి వైసీపీలోకొచ్చి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడయ్యారు. ఏ జెండా పట్టినా కీలక బాధ్యతలు చేపట్టారుగానీ ఏ పార్టీలోనూ ఇమడలేకపోతున్నారు సుబ్బారాయుడు.
అన్ని పార్టీలపై విసుగుచెంది సొంత గూటికి వెళ్దాం అనుకునే సమయానికి టీడీపీ-జనసేన పొత్తు ఖరారుతో మళ్లీ సందిగ్ధంలో పడ్డారట కొత్తపల్లి. 2019లో నరసాపురంలో రెండోస్థానంలో ఉన్న జనసేనకే ఆ సీటు ఖరారవుతుందన్న ప్రచారంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఈ సమయంలో టీడీపీలో చేరినా నరసాపురం టికెట్ దక్కదేమోనన్న సందిగ్ధంలో ఉన్నారంటున్నారు కొత్తపల్లి అనుచరులు. అందుకే మెగాస్టార్ ద్వారా నరసాపురం జనసేన టికెట్ కి ట్రై చేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నరసాపురంనుంచి పోటీకి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, ఎన్నారై కొవ్వలి యతిరాజా రామ్మోహన్‌నాయుడు, నియోజకవర్గ ఇంచార్జి పొత్తూరి రామరాజు సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు. జనసేన పార్టీలో 2019లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన బొమ్మిడి నాయకర్‌కి టికెట్ ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి రెండు పార్టీల్లోనూ ఖాళీ లేకపోయినా సీనియర్ నాయకుడు కొత్తపల్లి టికెట్ ఆశిస్తుండటం.. ఆ పార్టీల ముఖ్య నాయకులకు మింగుడు పడటం లేదు. మరోపక్క ఆయన ఏ పార్టీలో చేరినా తమ పనైపోయినట్లేనని నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
అయితే కొత్తపల్లి ముఖ్య అనుచరులు మాత్రం పొత్తులో టీడీపీ ఎవరికి టికెట్ కేటాయిస్తే ఆ పార్టీలో చేరేందుకు తమ నాయకుడు సిద్ధమవుతున్నారని బలంగా చెబుతున్నారు. స్టూడెంట్స్ మధ్య పవన్‌కల్యాణ్ పుట్టినరోజుని గ్రాండ్‌గా జరిపారు కొత్తపల్లి. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్‌ని ఖండిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి దీక్షా శిబిరంలో నేతలకు సంఘీభావం తెలిపారు. ఆయన ఆలోచనలెలా ఉన్నా ఆయనకి పార్టీలు సీటిస్తాయో లేక పక్కనపెడతాయో చూడాలి. కొత్త సంవత్సరమైనా కొత్తపల్లి జీవితంలో రాజకీయ సంక్రాంతి వస్తుందేమోనని ఆశగా చూస్తోంది ఆయన అనుచరగణం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం