Konaseema: ‘నా భర్తను బతికించండి’.. సౌదీలో చావుబతుకుల్లో ఉన్న భర్త కోసం భార్య అభ్యర్థన

| Edited By: Ram Naramaneni

Oct 11, 2024 | 1:53 PM

బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులను వదిలేసి సౌదీ వెళ్ళిన ఓ వ్యక్తి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. దీంతో తన భర్తను కాపాడాలని ఆ వ్యక్తి భార్య ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.

Konaseema: నా భర్తను బతికించండి.. సౌదీలో చావుబతుకుల్లో ఉన్న భర్త కోసం భార్య అభ్యర్థన
Teja Sri - Saibaba
Follow us on

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో బతుకు తెరువు కోసం కుటుంబాలను వదిలి అప్పులు చేసుకొని మరీ దుబాయ్‌, సౌదీకి వెళ్తుంటారు. తీరా అక్కడికి వెళ్లాక పని దొరక్క, తినడానికి తిండిలేక, పనిదొరికినా యజమానులు పెట్టే బాధలు భరించలేక, స్వదేశానికి తిరిగి వచ్చే మార్గం లేక నానా అవస్థలు పడుతుంటారు. తమను దేశానికి రప్పించి ఆదుకోవాలని ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటారు. ఇటీవల ఇలాంటి ఎన్నో ఘటనలు మనం చూశాం. తాజాగా అలాంటి మరో ఘటన సౌదీలో చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు తలపై ఇటుక పడి తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఓ వ్యక్తి. అతని భార్య తన భర్తను రక్షించాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటోంది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం గ్రామానికి చెందిన సానబోయిన సాయిబాబా రెండేళ్ల క్రితం సౌదీ వెళ్ళాడు. అక్కడ హెల్పర్ పనికి కుదిరాడు. ఇటీవల దురదృష్టవశాత్తు తలపై బలమైన ఇటుక పడడంతో గాయాల పాలయ్యాడు. దీంతో మెదడులోని నరాలు దెబ్బతినడంతో డాక్టర్లు రెండు ఆపరేషన్లు చేయాలని సూచించారు. అందుకు 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. తన భర్తను బతికించుకునేందుకు ఆపరేషన్ల కోసం 15 లక్షల రూపాయలు ఖర్చు చేసే స్తోమత తనకు లేదని సాయిబాబా భార్య తేజశ్రీ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తమకు యశ్విత అనే 4 సంవత్సరాల పాప కూడా ఉందని కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తన భర్తను బతికించాలని వేడుకుంటోంది. అలాగే తన భర్తను సౌదీ నుంచి ఇండియాకి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇందుకోసం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు కృషి చేయాలని వేడుకుంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..