దేశవ్యాప్తంగా దసరా సంబరాలు వైభవంగా జరిగాయి. అంబెడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో దసరా సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రపంచంలో ప్రాచీన కళల్లో ఒకటైన తాలింఖానాను నిర్వహిస్తారు. రాచరిక వ్యవస్థలోని యుద్ధరంగాన్ని, వీరుల పోరాట పటిమను తలపిస్తూ కర్రలు, కత్తులు, బల్లాల వంటి ఆయుధాలతో చేసే సాహస విన్యాసాలను చూడడానికి స్థానికులతో పాటు దేశ విదేశాల నుంచి దసరాకు అమలాపురానికి చేరుకుంటారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా అమలాపురంలో జరిగిన చెడి తాలింఖన సంబరాల్లో అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ చేసిన కర్ర సాము వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయదశమి సంబరాల్లో భాగంగా యువకులతో కలిసి కర్రసాము చేశారు డీఎస్పీ అంబికా ప్రసాద్. అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట కర్ర పట్టుకుని కర్రసాము చేసి అందరిని ఆశ్చర్య పరిచారు. డీఎస్పీ అంబికా ప్రసాద్ కర్ర సాము చేసిన తీరుకి యువకులు ఫిదా అయ్యారు.
తమ సంతోషాన్ని వెల్లడిస్తూ..డీఎస్పీని భుజాలపైకి ఎత్తుకుని చిందులు వేశారు. దసరా సంబరాల్లో ఎలాంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా చూడడంతో పాటు సంబరాల్లో పాల్గొని కర్రసాము చేసి ఉత్సాహపరిచారు. దీంతో పట్టణ ప్రజలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇలాగే ఉండలాలంటూ డీఎస్పీ అంబికా ప్రసాద్ ను అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..