Ashok Gajapathi Raju : అశోక్ గజపతిరాజు ఆనందానికి హద్దులేదు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆనందోత్సాహంతో ఉన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్ట రోజే తనకు శ్రీరాముడి దీవెనలు దక్కాయంటూ ఆనందం వ్యక్తం చేశారు.
రామతీర్థం ఆలయ చైర్మన్‌గా నన్ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు పక్కన పెట్టింది. రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్ట చేస్తున్నారని వార్తల్లో చూశా. అలాంటి మంచి రోజు ఆ శ్రీరాముడు నన్ను ఈ విధంగా దీవించాడు. ఆయన సేవలో కొనసాగించాలని సందేశం ఇచ్చాడంటూ ట్వీట్ చేశారు.
రామతీర్థం ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన
తర్వాత అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. రెండు పార్టీల నేతలు రామతీర్థం వెళ్లిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన అనంతరం ఆ ఆలయానికి చైర్మన్‌గా ఉన్న టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును తప్పించింది.
రామతీర్థం ఆలయ చైర్మన్ పదవితోపాటు మరో రెండు ఆలయాల చైర్మన్ పదవుల నుంచి ఆయన్ను తప్పించింది. పైడితల్లి అమ్మవారి ఆలయం, మండపల్లి ఆలయాల బాధ్యతల నుంచి ఆయన్ను తప్పిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ చైర్మన్‌గా ఉంటూ కూడా ఆలయాలను సంరక్షించలేకపోయారంటూ ఆయన్ను తప్పిస్తూ దేవాదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, విగ్రహాల పునఃప్రతిష్టాపన కోసం కొత్త మూర్తులను తయారు చేయించాల్సిందిగా అశోక్ గజపతిరాజు
లక్ష చెక్కును అందజేశారు. ఆ చెక్కును దేవాదాయ శాఖ తిరస్కరించింది. కొత్త విగ్రహాలను టీటీడీ
ఆధ్వర్యంలో చేయిస్తున్నారని చెబుతూ చెక్కును తిప్పి పంపింది. ఇదలా ఉంటే హైకోర్టు తీర్పు తమ దృష్టికి రాలేదన్నారు మంత్రి వెల్లంపల్లి. రామతీర్ధానికి అశోక్‌గజపతిరాజు ఏం చేశారో చెప్పాలన్నారు. రామతీర్దాన్ని భద్రాద్రిగా మారుస్తామన్నారు.
ఇదలా ఉంటే మిగతా ట్రస్ట్‌ల గురించి అశోక్‌గజపతిరాజు న్యాయపోరాటం చేస్తారా? రామతీర్ధం ఆలయ ధర్మకర్తగా మళ్లీ అశోక్‌గజపతిరాజు నియామకాన్ని సంచయిత తప్పుబడతారా? ఆమె వ్యూహం ఏంటన్నది ఆసక్తిగా మారింది.