Janasena: ఆ జిల్లా జనసేనలో వర్గ విభేదాలు.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌తో అయోమయంలో పార్టీ క్యాడర్

|

Feb 12, 2023 | 9:06 PM

నెల్లూరు జనసేనలో వర్గ విభేదాలు.. తారాస్థాయికి చేరాయి. ఇన్ని రోజులూ అక్కడ ఇంచార్జ్‌గా ఉన్న కేతంరెడ్డిని ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో క్యాడర్ అయోమయంలో పడింది.

Janasena: ఆ జిల్లా జనసేనలో వర్గ విభేదాలు.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌తో అయోమయంలో పార్టీ క్యాడర్
Kethamreddy Vinod Reddy Vs. Chennareddy Manukranth Reddy
Follow us on

నెల్లూరు నగరంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. జనసైనికుల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి స్థానికంగా యాక్టివ్‌గా ఉన్నారు. ఈసారి కూడా తానే అభ్యర్ధినంటూ.. జనాల్లో తిరుగుతూ ఉన్నారు. 300 రోజుల క్రితమే ప్రచారం చేపట్టారు. అయనకు అనూహ్యంగా జిల్లా అధ్యక్షుడి నుంచి షాక్ ఎదురైంది. రానున్న ఎన్నికల్లో అభ్యర్థి తానే అంటూ ప్రచారం మొదలుపెట్టారు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి. ఇరు వర్గాలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. 56వ డివిజన్‌లో పర్యటనలో భాగంగా.. కేతంరెడ్డి, చెన్నారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.

ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకూ వెళ్లింది. దీంతో కేతంరెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ నిర్దేశించిన క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులు నెల్లూరు సిటీలో ఇంచార్జ్‌గా ఉన్న నేతను సస్పెండ్ చేయడంపై పార్టీ వర్గాలు అయోమయంలో పడిపోయాయి. అయితే తనను సస్పెండ్ చేసే హక్కు జిల్లా అధ్యక్షుడికి‌ లేదంటున్నారు కేతంరెడ్డి వినోద్ రెడ్డి.

నెల్లూరు నగరంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్ధి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో జనసేనకు క్యాడర్ కూడా బలంగానే ఉంది. పైగా టీడీపీతో పొత్తు ఖాయం అయితే.. నెల్లూరు సిటీ టికెట్ జనసేనకే వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ టికెట్ కోసం రెండు వర్గాలు పోటీపడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. వీళ్లిద్దరి మధ్య విభేదాలతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు పార్టీ కార్యకర్తలు. అధినేత పవన్‌కళ్యాణ్.. ఈ విషయంలో కలగజేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం