AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీ మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు.. వీడియో చూశారా..?

Shaik Madar Saheb
|

Updated on: Oct 14, 2026 | 8:54 AM

Share

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ పర్యటనకు రానున్నారు. ఇవాళ, రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము సాయంత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోనున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల దుష్ట శక్తులను సంహరించి, భక్తులను రక్షించే శక్తిస్వరూపిణిగా మహాచండీ దేవిని కొలుస్తారు. దేవీ సప్తశతిలో ఈమెను అత్యంత శక్తివంతమైన దేవతగా అభివర్ణించారు. మహాచండీ దేవిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

ఇదిలాఉంటే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ, రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు.. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 40 నిమిషాల మధ్య కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇక రేపు పున్నమి ఘాట్‌లో సరస్ మేళాలో పాల్గొంటారు రాష్ట్రపతి. ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరస్ మేళా ప్రారంభిస్తారు.

సరస్ మేళాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గ్రామీణ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తుల విక్రయాల కోసం ఈ మేళా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట 10 నిమిషాల నుంచి 2 గంటల 10 నిమిషాల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో విందులో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుంచి రాష్ట్రపతి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.

Published on: Oct 14, 2026 08:28 AM
Follow Us