తూర్పుగోదావరి, డిసెంబర్31; నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు ఈ స్వాగతి ఏర్పాట్లులో ప్రతి ఏటా పై చేయి నిలుపుకుంటారు.ఈ ఏడాది యువ నర్సరీ రైతులు విన్నూత్న రీతిలో ఏర్పాటుచేసిన అద్భుత కూర్పులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేలాది స్వదేశీ,విదేశీ మొక్కలతో పదుల సంఖ్యలో కూలీలు గత వారం రోజులుగా శ్రమించి వీటిని తీర్చిదిద్దారు.
కడియపులంక పుల్లా ఆంజనేయులుకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మొక్కలతో ఈ అయోధ్య రామాలయాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారు. సుమారు 60 వేల మొక్కలు, పువ్వులతో తీర్చిదిద్దిన ఈ కూర్పు ను తిలకించడానికి సందర్శకులు పోటీపడుతున్నారు.
అదేవిధంగా పల్ల వెంకన్న నర్సరీలో ఏర్పాటు చేసిన 2024 సంవత్సరం స్వాగత ఏర్పాట్లు కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనేక రకాల మొక్కలతో నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడమేగాక అయోధ్య రామ మందిరం ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ఈ కూర్పును ఆ నర్సరీ యువ రైతులు పల్ల వెంకటేష్, వినయ్ ల ఆద్వర్యంలో ఏర్పాటు చేశారు.
అలాగే పుల్లా చంటియ్యకు చెందిన సత్యదేవ నర్సరీలో కూడా వేలాది మొక్కలతో రూపొందించిన ఈ నూతన సంవత్సర స్వాగత కూర్పు సందర్శకులను రా…రమ్మని ఆహ్వానిస్తున్నాయి. అలాగే జాతీయ రహదారి పక్కనున్న పుల్లా చిన సత్యనారాయణ , పుల్లా వెంకన్న నర్సరీలో కూడా నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన కూర్పులు అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ఈ 2024 సంవత్సరానికి స్వాగతం పలకడంలో కడియం నర్సరీ రైతులు తమ మార్కును ప్రదర్శించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..