
కడప నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్త ప్రవర్తనతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కడపలోని పటేల్ రోడ్డుకు చెందిన రెహానా ఇటీవల యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ పూర్తి చేసి గవర్నర్ చేతుల మీదుగా పట్టా పొందింది. ఈ క్రమంలో ఆమెకు ప్రొద్దుటూరుకు చెందిన ఐటీ ఉద్యోగి షాజహాన్‌తో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అనంతరం ఇద్దరూ తరచుగా ఫోన్, చాటింగ్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. అయితే, చాటింగ్ సమయంలో షాజహాన్ “నాకు ఇప్పటికే లవర్స్ ఉన్నారు”, “నువ్వంటే ఇష్టం లేదు”, “నిన్ను చూస్తే ఫీలింగ్స్ రావడం లేదు” అంటూ తరచూ వ్యాఖ్యలు చేసేవాడని సమాచారం. మొదట్లో సరదాగా అన్నాడేమోనని రెహానా లైట్‌గా తీసుకుంది. కానీ అదే విధంగా పదే పదే మాట్లాడడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెహానా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో 12 పేజీల సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.
ఈ ఘటనతో రెహానా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తనతో చివరిసారిగా మాట్లాడిన విషయాలు గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు, ఈ కేసులో చాటింగ్ మెసేజ్‌లు కీలకంగా మారే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత మానసికంగా వేధింపులకు గురిచేయడం ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.
Also Read: అప్పు వెంటనే కట్టాలని వేధిస్తున్నారా..? ఈ ఒక్కటి చేస్తే మీ జోలికి అస్సలు రారు..