
వాహనాల తనిఖీ అంటే కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మాత్రమే అనుకుంటే ఇకపై పొరపాటే. మత్తు పదార్థాలు, ముఖ్యంగా గంజాయి సేవించి రోడ్లపైకి వస్తే స్పాట్లోనే తాట తీసేందుకు కడప పోలీసులు సరికొత్త అస్త్రాన్ని రంగంలోకి దించారు. సరికొత్త ‘రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ల’తో రంగంలోకి దిగిన పోలీసులు.. గంజాయి బాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
కడప నగరంలో గంజాయి విచ్చలవిడిగా హల్‌చల్ చేస్తుండటం, ముఖ్యంగా యువత ఈ మత్తుకు బానిసలవుతుండటంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. విశాఖ, ఒడిశా ప్రాంతాల నుంచి కిలోల కొద్దీ గంజాయి కడపకు సరఫరా అవుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు యువతను టార్గెట్ చేశారు. అనుమానం వచ్చిన వారిని, వాహనాలు నడుపుతున్న వారిని ఆపి స్పాట్ లోనే యూరిన్ శాంపిళ్లను సేకరిస్తున్నారు. ప్రెగ్నెన్సీ నిర్ధారణ కోసం ఉపయోగించే ర్యాపిడ్ కిట్ల తరహాలోనే ఈ డ్రగ్ టెస్ట్ కిట్లు పనిచేస్తాయి. శాంపిల్ వేసిన కొద్ది నిమిషాల్లోనే ఫలితం తేలిపోతుంది.
గత నాలుగు రోజులుగా ముఖ్యంగా పాత కడప ప్రాంతంలో ఈ కిట్లను విరివిగా ఉపయోగిస్తూ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. స్పాట్ లోనే రిజల్ట్ వస్తుండటంతో గంజాయి సేవించినట్లు తేలిన యువకులను వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే అనేకమంది యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఈ కిట్ల ద్వారా ఆధారాలతో సహా దొరికిపోవడం గమనార్హం. పోలీసుల ఈ మెరుపు దాడితో గంజాయి రాయుళ్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..