Janasena: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. జనంలోకి జనసేన..

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాజకీయ యాత్రలకు మళ్లీ రెడీ వన్‌ టూ త్రీ అనబోతున్నారు పవన్‌ కల్యాణ్‌. మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధం అవుతున్నారు. మొదటి దశలో పొత్తుకు పార్టీ కేడర్‌ను సిద్ధం చేస్తారు. రెండో దశలో పార్టీ ఎన్నికల వ్యూహంపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారు. ఇక మూడో దశలో ప్రచార సభల్లో ఎన్నికల శంఖారావం పూరిస్తారు.

Janasena: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. జనంలోకి జనసేన..
Pawan Kalyan

Updated on: Feb 11, 2024 | 6:55 AM

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాజకీయ యాత్రలకు మళ్లీ రెడీ వన్‌ టూ త్రీ అనబోతున్నారు పవన్‌ కల్యాణ్‌. మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధం అవుతున్నారు. మొదటి దశలో పొత్తుకు పార్టీ కేడర్‌ను సిద్ధం చేస్తారు. రెండో దశలో పార్టీ ఎన్నికల వ్యూహంపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారు. ఇక మూడో దశలో ప్రచార సభల్లో ఎన్నికల శంఖారావం పూరిస్తారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. ఏపీలో రాబోయే ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఈసారి మూడు దశల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పొత్తుల నేపథ్యంలో మొదటి దశలో జనసేన, టీడీపీ లీడర్లు కేడర్‌ను సమన్వయం చేస్తారు. ఇక రెండో దశలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారు. ఇక మూడో దశలో ఎన్నికల ప్రచార భేరి మోగిస్తారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు చేపట్టనున్నారు పవన్. ఈ ఎన్నికల కార్యాచరణను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించబోతున్నారు. రెండు పార్టీల నేతలు క్షేత్ర స్థాయిలో కలిసి వెళ్ళేలా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య పలు నియోజకవర్గాల్లో వరుసగా వివాదాలు, విభేదాలు తెర పైకి వస్తూ ఉండడంతో…ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమాచారం. దీనిలో భాగంగా పవన్ తొలి దశలో టీడీపీ, జనసేన పార్టీల నేతలతో భేటీ అయి వారి మధ్య గ్యాప్ లేకుండా కలిసి వెళ్ళేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు పవన్‌. మొదట భీమవరంలో, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో పవన్‌ పర్యటన ఉంటుంది.

ఇక రెండో దశ పర్యటనను పవన్ కల్యాణ్‌ ఇదే నెలలో చేపట్టనున్నారు. ఆ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు.. పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ కల్యాణ్ పర్యటన ఉండబోతోంది. ముఖ్యంగా పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. టీడీపీతో కలిసి వెళ్ళే అంశం, పొత్తుల విషయంలో టీడీపీతో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పదే పదే చెప్తున్న పవన్‌.. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించేలా సొంత పార్టీ నేతలను మానసికంగా సిద్ధం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మూడో దశ పర్యటనలో పూర్తిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కల్యాణ్‌. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు పవన్ సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటికే పొత్తులో భాగంగా టీడీపీ నిర్వహిస్తున్న సభల్లో పవన్ కల్యాణ్‌తో కలిసి వెళ్ళే అంశంపై చంద్రబాబు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో, అదే బాటలో పవన్‌ ప్రచారం ఉంటుందని చెబుతున్నారు. ఇక పవన్ పాల్గొనే ప్రతి సభలోనూ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ముఖ్య నేతలను అహ్వానించేలా ఏర్పాట్లు చేస్తోంది జనసేన. తొలి రెండు దశలు అనుకున్నట్లు సాగితే.. మూడో దశలో పవన్‌ ఎన్నికల ప్రచారం ఈ నెలాఖరు నుంచే ఉంటుందంటున్నాయి జనసేన వర్గాలు.

మరోవైపు జనసేన నేతలకు పవన్‌ కల్యాణ్ లేఖ రాశారు. పొత్తులపై బహిరంగ విమర్శలు చేయొద్దంటూ పార్టీ శ్రేణులకు ఆ లేఖలో సూచించారు. అభిప్రాయ భేదాలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. మరో రెండు మూడు రోజుల్లో పోటీ చేసే స్థానాలపై పార్టీ లీడర్లకు, కేడర్‌కు పవన్‌ స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..