ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 45-60 సంవత్సరాల వయసున్న మహిళకు మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈనెల 22న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ కు రూ.4700 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం (Cabinet) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలుకు రూ.4020 కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం లభించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ర్యాటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. వీటితో పాటు గ్రామ సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున కేటాయించేందుకు అంగీకరించారు. గ్రేటర్ విశాఖలో లక్ష ఇళ్ల నిర్మాణం, 21.30 లక్షల మందికి ఇళ్లు కేటాయింపు, వర్సిటీలో అధ్యాపకుల కోసం నెట్ పాస్ నిబంధన, పాణ్యంలో డిగ్రీ కళాశాల మంజూరు, పాడేరు గిరిజన వర్సిటీలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ వర్సిటీలో 80 మంది రెగ్యులర్, 48 మంది నాన్ టీచింగ్ సిబ్బంది, దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మున్సిపల్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం, సీఆర్డీఏ అభివృద్ధికి రూ.1600 కోట్ల రుణానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ, సీఆర్‌డీఏ చట్టంలోని ఓ క్లాజ్‌లో మార్పులు చేశారు.
కాగా.. రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. అదనంగా 20 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 175 మంది ఖైదీలకు క్షమాబిక్ష పేరుతో విడుదల చేయనున్నారు. గ్రీన్ ఎనర్జీలో రూ.81వేల కోట్ల పెట్టుబడులు, 21 వేల ఉద్యోగాలు, ఆర్ అండ్ బీలో ఆర్కిటెక్ విభాగానికి 8 పోస్టుల మంజూరు, దివ్యాంగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు, భావనపాడు పోర్టు విస్తరణ, సచివాలయంలో 85 అదనపు పోస్టులు, ప్రతీ మండలంలో రెండు పీహెచ్‌సీలు, పైడిపాలెం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం లభించింది.