AP Weather: ఏపీ వ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు.. ప్రభావం ఇదే..!

| Edited By: Ram Naramaneni

Jun 21, 2024 | 2:08 PM

కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం చెప్పింది. పిడుగులు కూడా పడతాయనీ, వాన పడే సమయంలో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని IMD అంచనా వేసింది.

AP Weather:  ఏపీ వ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు.. ప్రభావం ఇదే..!
Weather
Follow us on

నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రమంతటా వ్యాపించాయి. దాదాపు వారం 10 రోజుల తర్వాత రుతుపవనాల్లో కదలిక వచ్చి ముందుకు వెళుతున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈనెల మొదటి వారంలోనే విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. ఆ తర్వాత ఉత్తర కోస్తాకు తాకాయి. విజయనగరం వరకు వచ్చి దాదాపుగా వారం పది రోజుల వరకు ఆగిపోయాయి. ఎందుకంటే రుతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు లేవు. రుతుపవనాల కరెంటు బలహీనంగా ఏర్పడింది. గత రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో అనుకూలమైన పరిస్థితులకు తోడు.. రుతుపవనాల కరెంటు బలపడడంతో.. నైరుతి రుతుపవనాలు.. విదర్భ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్‌లోనే మిగిలిన ప్రాంతాల్లో విస్తరించాయి. వాటితోపాటు పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో, వాయువ్య బంగాళాఖాతంలోనూ విస్తరించాయి.

రుతుపవనాలు ఈసారి రెండు మూడు రోజుల ముందుగానే కేరళను తాకి ఆ తరువాత ఏపీలోకి ప్రవేశించాయి. జూన్ 13వ తేదీ కల్లా ఏపీలో అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే పరిస్థితిలు ఏర్పడ్డాయి. వర్షాలు పుష్కలంగా కురవాలి. కానీ… నైరుతి బలాన్ని పుంజుకోలేదు. రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ రెండు మూడు చోట్ల మినహా.. ఆ స్థాయిలో వర్షాలు కురవలేదు. అరేబియా మహాసముద్రంలో రుతుపవన కరెంటు బలహీనంగా ఉండడంతో రుతుపవనాలు కాస్త మందగించాయి. ఇప్పుడు పరిస్థితి మారడంతో.. చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. అయినప్పటికీ మరింత బలాన్ని పుంజుకోవాల్సి ఉందని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.

నైరుతి రుతుపవనాలు ఏపీ అంతటా విస్తరించడంతో రాష్ట్రంలో చదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద. ఈరోజు కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. మన్యం, అల్లూరి జిల్లా, కాకినాడ కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం,  మన్యం, ఏలూరు, కృష్ణ ,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..