Solar Eclipse: మూఢ విశ్వాసాలపై అవగాహన.. గ్రహణం సమయంలోనే రహదారిపై..

సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయాల్లో హైందవ సాంప్రదాయాన్ని పాటించేవారు ఎన్నో నియమాలు పాటిస్తారు. గ్రహణం సమయంలో బయట తిరగకూడదని, ఒకవేళ తిరిగినా సూర్యుడు, చంద్రుడులను నేరుగా చూడకూడదని చెబుతారు. అంతేకాదు గ్రహణం అంటే మైలుగా భావిస్తారు. అందుకే గ్రహణం వీడిన..

Solar Eclipse: మూఢ విశ్వాసాలపై అవగాహన.. గ్రహణం సమయంలోనే రహదారిపై..
Awareness Campaign on Superstitions

Updated on: Oct 25, 2022 | 10:28 PM

సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయాల్లో హైందవ సాంప్రదాయాన్ని పాటించేవారు ఎన్నో నియమాలు పాటిస్తారు. గ్రహణం సమయంలో బయట తిరగకూడదని, ఒకవేళ తిరిగినా సూర్యుడు, చంద్రుడులను నేరుగా చూడకూడదని చెబుతారు. అంతేకాదు గ్రహణం అంటే మైలుగా భావిస్తారు. అందుకే గ్రహణం వీడిన తర్వాత తల స్నానం కూడా చేస్తారు చాలా మంది. అలాగే మిగిలిన పదార్థాలను తినరు. ఏదైనా తింటే గ్రహణం పట్టడానికి ముందే తినడంతో పాటు.. గ్రహణం సమయంలో మంచి నీళ్లు కూడా ముట్టరు. గ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో వేస్తారు. గరిక వేస్తే ఆ పదార్థాలకు అంటు ఉండదని, మైలు పట్టదని విశ్వసిస్తారు కొంతమంది. గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఉంచుతారు. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంటుందని, అందుకే ఈ సమయంలో ఏ పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టకూడదని పెద్దలు చెబుతారు. దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలు, గృహాలను సంప్రోక్షణ లేదా శుద్ధి చేస్తారు. అయితే ఈ ఆచారాలపై కొంతమంది అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. అవి కేవలం మూఢ నమ్మకాలు మాత్రమేనని, అటువంటి వాటిని పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదని, సైన్స్ ప్రకారం గ్రహణం సమయంలో ఏవైనా ఆహార పదార్థాలు తింటే ఎటువంటి ప్రమాదం ఉండబోదని కొంతమంది చెబుతున్నారు.

విశాఖపట్టణంలో మూడ నమ్మకాలపై దళిత హక్కుల సంఘం అవగాహన కల్పించింది. సూర్యగ్రహణం సందర్భంగా విశాఖపట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. గ్రహణం సమయంలోనే వంట వార్పు చేసి, ఆహారం భుజించారు. సూర్యగ్రహణం చూడండి.. మూఢనమ్మకాలను వీడండి.. అంటూ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. విజ్ఞానాన్ని, శాస్త్రీయతను కాపాడుకుందామని, మూఢ నమ్మకాలను నమ్మవద్దంటూ నినాదాలు చేశారు. మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా నగరంలో ప్రదర్శన చేపట్టారు. గ్రహణం సమయంలోనే వంటావార్పు కార్యక్రమం నిర్వహించి, గ్రహణాన్ని వీక్షిస్తూ భోజనం చేయడం ద్వారా ఎటువంటి సమస్యలు ఉండవంటూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

మరోవైపు జనవిజ్ఞాన వేదికతో పాటు మరి కొన్ని సంస్థలు కూడా ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మూఢ విశ్వాసాలపై అవగాహన కల్పించారు. కాగా.. ప్రజలను అయోమయానికి గురిచేసి, హైందవ సంప్రదాయాన్ని నీరుగార్చేందుకే కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. గ్రహణం రోజు పాటించే నియమాలను మూఢనమ్మకాలు అనడం పై కొన్ని హైందవ సంస్థలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల  కోసం చూడండి..