
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో శుక్రవారం (జూన్ 26) తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాచర్ల పట్టణ సమీపంలోని నగరవనం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని, వేగంగా దూసుకొచ్చిన తుఫాను వాహనం వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
బాధిత కుటుంబం హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. తెల్లవారుజామున చీకటిగా ఉండటం, అలాగే వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆగిన ఉన్న లారీని ఢీకొట్టిన తీవ్రతకు తుఫాన్ వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిని హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతులను కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలి గా గుర్తించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వాహనంలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉన్న మృతుల బంధువులకు సమాచారం అందించడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..