బాలయ్య నియోజకవర్గంలో కాల్పుల కలకలం.. బొలెరో ముఠా కోసం పోలీసుల ఛేజింగ్!

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న బొలెరో ముఠా మరోసారి కలకలం సృష్టించింది. పోలీసులు ఛేజింగ్ చేసి మూడు రౌండ్లు కాల్పులు జరిపినా, ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లోని ఈ ముఠా పారిపోయింది. ఆగస్టు 6న కూడా పోలీసు వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకున్న వీరు, ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో పరారయ్యారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

బాలయ్య నియోజకవర్గంలో కాల్పుల కలకలం.. బొలెరో ముఠా కోసం పోలీసుల ఛేజింగ్!
Bolero Gang

Updated on: Aug 29, 2026 | 2:11 PM

శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం పరిసరాల్లో మరోసారి బొలెరో వాహనంలో తిరుగుతున్న అనుమానిత ముఠా కలకలం సృష్టించింది. పందులు, పశువులు, ఇతర జంతువులను దొంగిలించేందుకు కర్ణాటక నుంచి వస్తున్నట్లు అనుమానిస్తున్న ఈ ముఠా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపినా వారు వాహనంతో పరారయ్యారు.

పరిగి మండలం ఊటుకూరు ప్రాంతంలో అనుమానిత బొలెరో ముఠా సంచరిస్తోందన్న సమాచారంతో హిందూపురం రూరల్ సీఐ జనార్దన్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం రంగంలోకి దిగింది. దుండగుల వాహనం కోసం దాదాపు రెండు గంటల పాటు ఏపీ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పోలీసులు ఛేజింగ్ చేశారు.

ఊటుకూరు సమీపంలో దుండగుల వాహనాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారు తప్పించుకునేందుకు వేగంగా వాహనాన్ని నడిపారు. ఈ క్రమంలో పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. అయినప్పటికీ దుండగులు పట్టుబడకుండా పెనుకొండ, మడకశిర, పరిగి మీదుగా కర్ణాటక వైపు వెళ్లిపోయారు. పోలీసులు కర్ణాటకలోని పావగడ వరకు వెంబడించినా బొలెరో వాహనంలో నిందితులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే ముఠా ఆగస్టు 6న హిందూపురం శివారులో పోలీసుల తనిఖీల సమయంలో పోలీసు వాహనాన్ని ఢీకొట్టి పరారైనట్లు సమాచారం. అప్పటి నుంచి ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి. తాజాగా మరోసారి ఇదే తరహాలో ఘటన జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. రాత్రి వేళల్లో పశువులు, పందులు, ఇతర జంతువులను దొంగిలిస్తున్నట్లు అనుమానిస్తున్న ఈ ముఠా కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో హిందూపురం పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us