
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంతో కూటమి, బాబు షూరిటీ-మోసం గ్యారంటీ అంటూ వైసీపీ… ఇలా పోటాపోటీ ప్రోగ్రామ్స్‌తో కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంవత్సరకాలంలో చేసిందేమీ లేదు… హంగులు, ఆర్భాటాలు తప్పా అంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు గుడివాడ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు మోసాలంటూ పెద్దపెద్ద అక్షరాలతో రాశారు. ఇక వైసీపీకి కౌంటర్‌గా రంగంలోకి దిగిన టీడీపీ నేతలు మాజీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారంటూ సవాల్ చేసిన వ్యక్తి ఎక్కడ దాక్కున్నారంటూ ఇంకాస్త పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పెద్ద రచ్చకు కారణమైంది. వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రోడ్డెక్కిన వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీపై విరుచుకుపడ్డారు. కొడాని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుడివాడలోనే కాదు… అసలు ఏపీలో ఉండే అర్హత కొడాలికి లేదంటూ నిప్పులు చెరిగారు. వన్ ఇయర్ ప్రజాపాలనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడతారా…? మేమేంటో చూపిస్తామంటూ వైసీపీ నేతల ఫోటోలను చించేశారు. అంతేకాదు… గుడివాడలో జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తున్న వైసీపీ నేతల కార్లను సైతం అడ్డుకుంటూ నిరసన తెలిపారు. ఆ క్రమంలో ZP చైర్‌పర్సన్ హారిక కారు ధ్వంసమైంది.
ఇంతటితో ఆగలేదు టీడీపీ కార్యకర్తలు. వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతున్న కే కన్వెన్షన్ వైపు దూసుకెళ్లారు. మీటింగ్ జరక్కుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కన్వెన్షన్ లోపలికి వెళ్లకుండా చుట్టూ మోహరించారు. ఇటు వైసీపీ శ్రేణులు కూడా తగ్గేదేలే అంటూ… టీడీపీ తీరుకు నిరసనగా గుడివాడలోని నాగవరప్పాడు జంక్షన్‌కు బయల్దేరారు. అయితే మార్గమధ్యలోనే వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఘర్షణలు జరుగుతాయంటూ ఎక్కడివాళ్లను అక్కడి కట్టడి చేశారు.
మొత్తంగా… ఇరువర్గాల తీరుతో గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోన్న భయంతో పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరీ ఫ్లెక్సీల విషయంలో మొదలైన ఈ రచ్చ ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.