
మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల్లో లంకెబిందెలు బయటపడ్డాయన్న సమాచారం కలకలం రేపుతోంది. ఓ గుప్తనిధుల ముఠా ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు గుప్త నిధులను తవ్వి అందులో లభించిన లంకెబిందెల్లోని సొమ్ము స్వాహా చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మార్కాపురం జిల్లా తురిమెళ్ళ అటవీ క్షేత్ర స్థాయి అధికారులు.. ట్రైబల్ వాచర్లతో కలిసి గుప్తనిధులు తవ్వకాలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఈ తవ్వకాల్లో ఓ రెండు పెద్ద మట్టి కుండలు బయటపడగా అందులో వజ్రాలు, బంగారం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దొరికిన బంగారం, వజ్రాలను తొలుత హైదరాబాద్‌లో అమ్మేందుకు ప్రయత్నించి అది విఫలం కావడంతో బెంగళూరులో అటవీశాఖ అధికారులు అమ్ముకున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సమాచారం గురించి అటవీశాఖ అధికారులను మీడియా వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారులు స్పందించడం లేదు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డివిజన్లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యర్రకుంట్ల సమీపంలో ఓ నెలకిందట ఈ తవ్వకాలు చోటుచేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. వెలగలపాయ ఫారెస్ట్ బీట్ అధికారికి యర్రగొండపాలెంకు చెందిన కొందరు గుప్తనిధుల ముఠా సభ్యులు విచారణ సందర్భంగా ఇచ్చిన సమాచారం మేరకు ఈ తవ్వకాలు చేసినట్టు తెలిసింది… గిరిజన ట్రైబల్ వాచర్ల సాయంతో భారీగా తవ్వకాలు జరిపి గుప్తనిధుల కుండలు వెలికితీసి, ఆ సందర్బంగా తీసినట్టుగా చెబుతున్న ఓ వీడియో ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ లంకెబిందెల్లో బంగారం, వజ్రాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో అటవీ అధికారులు తీసుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కూడా స్వయంగా పోస్ట్ చేశారట. గుప్త నిధుల తవ్వకాల వ్యవహారం పోలీసులకు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది… పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.