
గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరానికి చెందిన రవి తేజ డిగ్రీ చదువుకున్నాడు. ప్రస్తుతం పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన చూసిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. రవితేజ ఇంట్లోని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే రవితేజను కిందకి దించి చూడగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవితేజ రెండేళ్లుగా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కూడా ఇష్టపడటంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే, ఇద్దరికి జాబ్స్ లేకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే రవితేజ పెయింటర్ పనిచేస్తుండగా.. యువతి జాబ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లింది.
అక్కడకు వెళ్లిన దగ్గర నుంచి యువతి రవితేజతో మాట్లాడటం తగ్గించింది. దీంతో అనుమానం వచ్చిన రవితేజ ఆరా తీయగా మరొకరితో సన్నిహితంగా ఉంటుందని తెలిసింది. దీంతో రవితేజ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అయినప్పటికీ.. రవితేజ మరోసారి పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినా.. ఆ యువతి మాత్రం దాటవేస్తూ వచ్చింది. దీంతో మరింత కుంగిపోయాడు.
ఒకవైపు జాబ్ లేకపోవడం మరొకవైపు ప్రేమించిన యువతి దూరం కావడంతోనే తనువు చాలించాలనుకున్నాడు. తనలో తాను మథనపడుతూ నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్న రవితేజ ముందుగా అనుకున్న ప్రకారమే చనిపోయాడు. అయితే తల్లిదండ్రుల వద్ద నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..