
స్ట్రోక్ చికిత్సలో భారతదేశానికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. గుంటూరుకి చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు, లలిత పీ.వీ.ఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో న్యూరోసైన్సెస్ విభాగాధిపతి, అంకినీడు అడ్వాన్స్‌డ్ స్టోక్ సెంటర్ డైరెక్టర్, గుంటూరు న్యూరోసైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డా. పి. విజయ ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎన్నికైన తొలి భారతీయ న్యూరాలజిస్టుగా ఆమె చరిత్ర సృష్టించారు.
ప్రపంచవ్యాప్తంగా 95 దేశాలకు చెందిన సుమారు 3,500 మంది డబ్ల్యూఎస్‌ఓ సభ్యులు నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 18 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ఎన్నుకున్నారు. అమెరికా, యూరప్, ఆఫ్రికా-మిడిల్ ఈస్ట్‌లతో పాటు ఉన్న నాలుగు ప్రధాన ఖండాల గ్రూపులలో ఒకటైన ఆసియా-ఓషియానియా ప్రాంతానికి డా. విజయ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్ట్రోక్ చికిత్స, పరిశోధన, ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజారోగ్య విధానాల రూపకల్పనలో ఆమె అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
ప్రపంచ స్ట్రోక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ నివారణ, చికిత్స, పునరావాసం, పరిశోధన, వైద్య విద్య, ప్రజల్లో అవగాహన పెంపు వంటి కార్యక్రమాలను సమన్వయం చేస్తోంది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలిగా ఎన్నికైన డా. విజయ ఈ కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్నారు.
డా. విజయ్ 2026 నుంచి 2030 వరకు ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా సేవలందించనున్నారు. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ వైద్య సేవలకు సంబంధించిన మార్గదర్శకాలు, పరిశోధనలు, క్లినికల్ విధానాలు, శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాల రూపకల్పనలో భాగస్వామ్యం కానున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్ట్రోక్ చికిత్సను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగే కొత్త బోర్డు తొలి సమావేశంలో ఆమె పాల్గొననున్నారు.
భారతదేశంలో ఆధునిక స్ట్రోక్ వైద్య సేవలకు పునాది వేసిన ప్రముఖ నిపుణుల్లో డా. విజయ ఒకరు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్ట్రోక్ యూనిట్‌ను ప్రారంభించారు. ముంబై, చెన్నై తర్వాత దేశంలో ఏర్పాటు చేసిన మూడో స్ట్రోక్ యూనిట్‌కు ఆమె నాయకత్వం వహించారు. ఆమె ఆధ్వర్యంలో ఈ కేంద్రం విశేషంగా అభివృద్ధి చెంది, భారతదేశంలోనే తొలి గుర్తింపు పొందిన అడ్వాన్స్‌డ్ స్ట్రోక్ సెంటర్ గా గుర్తింపు పొందింది.
డా. విజయతో పాటు ఆమె నాయకత్వంలోని అంకినీడు అడ్వాన్స్‌డ్ స్ట్రోక్ సెంటర్ అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అందించే పాల్ డడ్లీ వైట్ ఇంటర్నేషనల్ స్కాలర్ అవార్డు, అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (AAN) ప్రదానం చేసే ఏ.బి. బేకర్ అవార్డు, అలాగే ప్రపంచ స్ట్రోక్ సంస్థ–ఏంజెల్స్ కార్యక్రమం నుంచి వరుసగా డైమండ్ స్టేటస్ అవార్డులు అందుకోవడం విశేషం.
డా. పి. విజయ ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నిక కావడం భారత వైద్య రంగానికి దక్కిన అరుదైన గౌరవంగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో స్ట్రోక్ వైద్య విధానాల రూపకల్పనలో భారతీయ వైద్యుల పాత్ర మరింత బలపడేందుకు ఆమె ఎన్నిక దోహదపడనుందని, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ చికిత్సలో భారత అనుభవానికి మరింత గుర్తింపు తీసుకురానుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.