Andhra Pradesh: పెళ్లికూతురు డ్యాన్స్.. పెళ్లి క్యాన్సిల్.. అసలు ట్విస్ట్ తెలిస్తే నోరెళ్లబెడతారు..

పెళ్లి అనేది నూరేళ్ల పంట.. రెండు మనసులు, రెండు కుటుంబాలు కలిసే ఒక పవిత్ర బంధం. అయితే బంధువుల కోరిక మేరకు వధువు వేసిన ఒక్క స్టెప్పు.. ఆ పెళ్లి పందిరిలోనే పెద్ద వివాదానికి దారితీసింది. అమ్మాయి ఆత్మగౌరవమే ముఖ్యమంటూ వధువు తండ్రి తీసుకున్న సంచలన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh: పెళ్లికూతురు డ్యాన్స్.. పెళ్లి క్యాన్సిల్.. అసలు ట్విస్ట్ తెలిస్తే నోరెళ్లబెడతారు..
Wedding Cancelled After Bride Dance

Edited By:

Updated on: Jul 06, 2026 | 12:42 PM

అప్పటివరకు ఆ ఊళ్లో పెళ్లి సందడి అంబరాన్ని తాకింది. మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వధువు, వరుడు ఊరేగింపుగా వస్తున్నారు. బ్యాండ్ మేళాల మధ్య బంధుమిత్రులు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు. కానీ ఊహించని విధంగా జరిగిన ఓ చిన్న వివాదం.. అప్పటివరకు ఎంతో కోలాహలంగా ఉన్న పెళ్లి పందిరిని కాస్త బోసిపోయేలా చేసింది. వధువు డ్యాన్స్ చేయద్దంటూ వరుడు కోప్పడటంతో.. ఏకంగా పెళ్లే రద్దు అయిన ఘటన మార్కాపురం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది..?

మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడికి, కంభం మండలం తురిమెళ్లకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇందులో భాగంగా ఆదివారం వరుడి గ్రామమైన చిన్నగానిపల్లిలో వివాహ వేడుకకు ఇరువైపులా బంధువులు భారీగా తరలివచ్చారు. పెళ్లికి ముందు సంప్రదాయం ప్రకారం వధువు, వరులను గ్రామంలో ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. పాటల హోరు, బంధువుల డ్యాన్సులతో వాతావరణం ఎంతో సందడిగా మారింది. ఈ విధంగా బంధువులందరూ కలిసి వధువును కూడా తమతో పాటు డ్యాన్స్ చేయాలని పట్టుబట్టారు. మొదట కాస్త సంకోచించినా, బంధువులు గట్టిగా బలవంతం చేయడంతో వధువు కూడా వారితో కలిసి స్టెప్పులు వేసేందుకు సిద్ధమైంది.

వరుడి ఆగ్రహం.. ఖంగుతిన్న ఆడపెళ్లివారు..

వధువు డ్యాన్స్ చేయడానికి సిద్ధమవ్వడం చూసిన వరుడు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యాడు. గట్టిగా కేకలు వేస్తూ.. వధువు డ్యాన్స్ చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో వధువుపై గట్టిగానే కోప్పడ్డాడు. అందరి ముందు వరుడు అంతలా ప్రవర్తించడంతో వధువు తరపు బంధువులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వరుడి ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆడపెళ్లివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి కాకముందే, అందరి ముందు తమ బిడ్డపై ఇంతలా కోప్పడితే.. రేపు పెళ్లి అయిన తర్వాత తమ అమ్మాయిని ఇంకెంత రాచిరంపాన పెడతాడోనని వధువు తండ్రి, బంధువులు భయపడ్డారు. దీంతో క్షణాల్లో వాతావరణం మారిపోయింది. ఈ ప్రవర్తన నచ్చని వధువు తండ్రి.. ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంటున్నట్లు అక్కడికక్కడే సంచలన ప్రకటన చేశారు. అనంతరం వధువుతో సహా ఆడపెళ్లివారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పెద్దలు ఇరుపక్షాలకూ సర్దిచెప్పేందుకు ప్రయత్నించేందుకు వధువు తరపు వారు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఓ చిన్న డ్యాన్స్ వివాదం కాస్తా.. పెళ్లి పీటల వరకు వచ్చిన సంబంధం రద్దు అయ్యే వరకు వెళ్ళడం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది

Loading...
Unable to load recommendations.
Follow Us