AP cabinet Ministers resignation: ఏపీ కేబినేట్‌లోని మొత్తం 24 మంది మంత్రులు తమ పదవులకు (AP Cabinet ministers) రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆదేశాలకు అనుగుణంగా అంతా ఒక్కసారిగా రాజీనామాలు సమర్పించారు. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కాగా.. మంత్రుల రాజీనామా లేఖల ఫైల్ రాజ్‌భవన్‌కు చేరింది. ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరించంద్రన్ (Biswabhusan Harichandan) రాజీనామాలు ఆమోదించనున్నారు. మంత్రులు రాజీనామాలతో పదవులు ఖాళీ అయినట్లు ఈరోజు గవర్నర్ గెజిట్ విడుదల చేసే అవకాశముంది. కాగా.. మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ వరకు మూడు రోజులపాటు సీఎం జగన్ వద్దే అన్ని ప్రభుత్వ శాఖలు ఉండనున్నాయి.
కాగా.. రాజీనామాల నేపథ్యంలో మంత్రులకు ఇచ్చిన వాహనాలను ఈరోజు ప్రోటోకాల్ అధికారులు వెనక్కి తీసుకోనున్నారు. దీంతోపాటు మంత్రుల సిబ్బంది సైతం పేషీలు ఖాళీ చేయనున్నారు. మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందికి ఈరోజు రిలీవ్ ఆర్డర్లు కూడా ఇవ్వనున్నారు. దీంతో మంత్రుల ఛాంబర్లను సాధారణ పరిపాలన శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. మంత్రుల పేషీలకు ఉన్న నేమ్ బోర్డులు కూడా ఈరోజు తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు.
అయితే.. అంతకుముందు పదవీ బాధ్యతలు తీసుకున్న మంత్రులు తమకు నచ్చిన విధంగా ఛాంబర్లలో ఇంటీరియర్ చేయించుకున్న విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా ఛాంబర్లను మార్పు చేసుకున్న వారిలో బొత్స, పేర్ని నాని, సుచరిత ఉన్నారు. అయితే.. పాత మంత్రులు కొత్త కేబినెట్ లోకి వచ్చినా శాఖలు మరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులందరూ రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read: