Andhra: తండ్రి మరణం, బతకడం కోసం కొబ్బరి బోండాల కొట్టు.. ఇప్పుడు ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్..

పేదరికం, తండ్రి మరణం, అప్పుల భారం.. ఇలా ఎన్ని సవాళ్లు ఎదురైనా… పట్టుదలతో ముందుకు సాగిన విజయనగరం యువకుడు పవన్ కుమార్. పగలు పనులు చేస్తూ, రాత్రిళ్లు చదివి చివరకు ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.

Andhra: తండ్రి మరణం, బతకడం కోసం కొబ్బరి బోండాల కొట్టు.. ఇప్పుడు ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్..
Pawan Kumar With Mother

Edited By:

Updated on: Apr 13, 2026 | 4:44 PM

పేదరికం నుంచి పట్టుదలతో పైకి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచాడు విజయనగరం జిల్లాకు చెందిన పవన్ కుమార్ అనే యువకుడు. గంట్యాడ మండలం పెణసాం గ్రామానికి చెందిన పవన్ కుమార్ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యంపై మాత్రం దృష్టి కోల్పోలేదు. అతనిది సాధారణ  దిగువ మధ్య తరగతి కుటుంబం. పవన్ తండ్రి సన్యాసిరావు ఆటోడ్రైవర్‌గా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ కొడుకును చదివించాడు. పేదరికంలో ఉన్నా.. వచ్చిన కొద్దిపాటి సంపాదనతో కుటుంబమంతా సంతోషంగా ఉండేది.  అయితే పవన్ డిగ్రీ చదువుతున్న సమయంలో… తండ్రి అనారోగ్యం బారిన పడ్డాడు. ఏదో ఒక విధంగా తండ్రిని బ్రతికించుకోవాలని తపనతో చేతిలో డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ తండ్రికి చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేక తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా పవన్ భుజాలపై పడ్డాయి. ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్న సమయంలో చదువును కొనసాగించడం సవాలుగా మారింది. ఒక సంవత్సరం చదువులో విరామం కూడా వచ్చింది. అయినా మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాడు. జీవనోపాధి కోసం కొబ్బరి బొండాలు అమ్మడం, జ్యూస్ షాపు నడపడం మొదలుపెట్టాడు. రోజంతా కష్టపడి పనిచేస్తూనే రాత్రిళ్లు చదువుకు సమయం కేటాయించేవాడు. తండ్రి వైద్యం కోసం చేసిన అప్పులను తల్లి లక్ష్మితో కలిసి నెమ్మదిగా తీర్చుకుంటూ వచ్చాడు.

ఈ సమయంలో తల్లి పవన్‌‌ను చదువు ఆపవద్దు, బాగా చదువుకో అని గట్టిగా ప్రోత్సహించింది. అమ్మనూరిపోసిన మాటలు.. అతనికి మంచి బూస్ట్‌లా పనిచేశాయి. ఆమె ఇచ్చిన ధైర్యం ఆయనకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. అలా చదువుతున్న సమయంలో స్నేహితుడి సూచనతో ఎస్.ఎస్.సి సిజిఎల్ పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయినా నిరుత్సాహపడకుండా మరింత కష్టపడి మళ్లీ పరీక్ష రాశాడు. చివరకు తన లక్ష్యాన్ని సాధించి ఆదాయపు పన్ను శాఖలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగం పొందాడు. అంతే ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవ్. తన విజయాన్ని తల్లికి అంకితం చేశాడు పవన్. కష్టపడి చదివితే ఎలాంటి పరిస్థితులైనా అధిగమించవచ్చని, పేదరికం ఎప్పుడూ అడ్డంకి కాదని నిరూపించిన ఈ యువకుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

Also Read: సూపర్ హర్షిత.. ఇంటర్‌లో 994 మార్కులతో మెరిసిన రైతు బిడ్డ.. 

 

Follow Us