
ప్రమాదాల వలన గానీ, లేదా ఇతర కారణాల వల్ల గానీ శరీరంపై కాలిన గాయాలు (burn injuries) కలిగిన వారు చాలా సార్లు తమ రూపం చూసుకుని ఆత్మన్యూనత భావానికి లోనవుతుంటారు. పోని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందామంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. పేద, మధ్యతరగతి వర్గాలకు అవ్వని వ్యవహారం. అలాంటి బాధితులకు ఇప్పుడు ఆశాకిరణం కనబడింది. బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ (BSMS) ఆధ్వర్యంలో.. పెగాసిస్టమ్ సంస్థ సహకారంతో ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సలహాదారు నాగరాజు ప్రకటించారు.
ఈ ఉచిత శస్త్రచికిత్సల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు జరుగనుంది. సర్జరీలు పూర్తిగా ఉచితంగా నిర్వస్తామని.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కాలిన గాయాల బాధితులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని నాగరాజు సూచించారు.
“ప్రమాదవశాత్తు గాయపడినవారి రూపం మారిపోవడంతో వారు మానసికంగా కుంగిపోతారు. ప్లాస్టిక్ సర్జరీ చాలా ఖరీదైనది కావడంతో చాలామంది దూరంగా ఉంటారు. అలాంటి వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం ప్రారంభించాం” అని నాగరాజు తెలిపారు. దీని ద్వారా అనేక మంది బాధితులు మళ్లీ తమ సాధారణ జీవితం వైపు అడుగులు వేయగలరని చెప్పారు. ఉచిత సర్జరీలకు సంబంధించి పూర్తి సమాచారం, నమోదు వివరాల కోసం బాధితులు 7816079234 నంబర్‌ను సంప్రదించవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..