
ప్రత్తిపాడు, జూన్ 19: గుంటూరు జిల్లాలో రిజర్వుడ్ నియోజకవర్గమైనా రాజకీయంగా కీలకమైన నియోజకవర్గం ప్రత్తిపాడు. వైసీపీ నుంచి మరోసారి పోటీకి మాజీ హోంమంత్రి సుచరిత లైన్‌లో ఉన్నారు. అయితే టీడీపీ క్యాండేట్ ఎవరన్నదే తమ్ముళ్లకు ఓ పట్టాన అంతుపట్టటంలేదు. ఇదే సమయంలో మరోసారి ప్రత్తిపాడునుంచి పోటీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన రావెల టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అదృష్టం కలిసొచ్చి మంత్రి కూడా అయ్యారు. అయితే మధ్యలోనే మంత్రి పదవి పోవటంతో టీడీపీని వీడారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు రావెల. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీకి ఉన్నట్లుండి గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఆయన మళ్లీ టీడీపీలోకి చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అంరదినీ ఆశ్చర్యపరుస్తూ బీఆర్‌ఎస్‌లో చేరారు రావెలకిషోర్‌బాబు.
బీఆర్‌ఎస్‌లో మొదట్లో యాక్టివ్‌గా కనిపించారు రావెల కిషోర్‌బాబు. రెండు మూడు కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఏమైందో ఏమో గాని కొన్నాళ్లుగా కారు పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. గత నెలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో కూడా ఆయన కనిపించలేదు. దీంతో రావెల బీఆర్‌ఎస్‌ని కూడా వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సార్ మళ్లీ సైకిల్ ఎక్కబోతున్నారంటోంది రావెల అనుచరగణం. 2009 ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో మేకతోటి సుచరిత విజయం సాధించారు. అయితే 2014లో రావెల కిషోర్ బాబు అనూహ్యంగా సుచరితను ఓడించారు. 2019లో మాత్రం మళ్లీ సుచరితే గెలిచారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరన్న చర్చ జరుగుతున్న సమయంలో మళ్లీ రావెల పేరు వినిపిస్తోంది.
2009కి ముందు జనరల్‌గా ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. మాకినేని పెదరత్తయ్య ఇక్కడినుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని తహతహలాడుతోంది టీడీపీ. అయితే రావెల ఇంకా అధికారికంగా టీడీపీలో చేరలేదు. మరోవైపు టీడీపీ అధినాయకత్వం కూడా రిజర్వుడ్ సీట్లో ఎస్సీ నేతను కాకుండా పెద రత్తయ్యనే ఇంచార్జిగా కొనసాగిస్తోంది. రావెల కోసమే ఎస్సీ నేతలెవ్వరికీ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వలేదన్న ప్రచారం కూడా ఉంది. మరి టీడీపీని వీడాక ముచ్చటగా మూడు కండువాలు మార్చేసిన రావెల మళ్లీ సైకిల్ ఎక్కుతారా.. పొత్తుల ప్రచారంతో టీడీపీనే రాజకీయంగా సేఫ్ అనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతున్నా ఆయన రీఎంట్రీ ఎప్పుడన్నదే ఇంకా క్లారిటీ లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం