
ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి భగ్గుమన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యక్తులను మేనేజ్ చేస్తూ.. తనపై తిప్పుకుంటున్నారన్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. చంద్రబాబుకు లొంగిపోయారన్నారు. కూటమికి మేలు చేసేందుకే విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని జగన్ గుర్తు చేశారు. ప్రలోభాలకు లోనై విజయసాయి పదవిని అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అక్రమ అరెస్టులతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని జగన్ మండిపడ్డారు.
గురువారం(మే 22) తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. ఏపీలో రకరకాల బ్రాండ్‌ల మధ్యం అమ్ముతున్నారని, ఆ పేర్లు గతంలో ఎప్పుడూ వినలేదంటూ కొన్ని పేపర్లు చూపించారని జగన్ విమర్శించారు. బేతాళ కథలతో లిక్కర్ కేసులో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించిన జగన్, అరెస్టైన నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. మిథున్‌రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వాసుదేవరెడ్డికి లిక్కర్ పాలసీకి సంబంధం ఏంటని జగన్ నిలదీశారు. రాజ్ కేసిరెడ్డికి కేశినేని చిన్నితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, లిక్కర్ ఫైల్ ఒక్కటైనా సీఎంవోకు వచ్చినట్టు చంద్రబాబు నిరూపించగలరా? అని వైఎస్ జగన్ నిలదీశారు.
2014 నుంచి 2019 మధ్య భారీగా మద్యం కుంభకోణం జరిగిందని జగన్ ఆరోపించారు. 2014 నుంచి 19 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నది నిజం కాదా? అని జగన్ అన్నారు. 2019-2024 మధ్య లిక్కర్ సేల్ తగ్గిందన్న జగన్.. ఒక్క కంపెనీకి లైసెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. లాభాపేక్ష లేకుండా వైసీపీ సర్కార్ అమ్మకాలు జరిపిందని జగన్ గుర్తు చేశారు. స్కామ్ జరగకపోయినా.. జరిగినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. లిక్కర్ కేసులంటూ తప్పుడు ఆరోపణలతో.. వైసీపీ నేతలతో పాటు అధికారులను వేధిస్తున్నారు అని వైఎస్ జగన్ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..