
వేసవి కాలంలోనే వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపనాలు రాక ముందే.. రోహిణీ కార్తీ వెళ్ళక ముందే తొలకరి వానలు పలకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలో అనేక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎండల నుంచి ఉపశమనం ఇవ్వడమే కాదు కాదు చెరువులు, కుంటలు నిండుతున్నాయి. వేసవిలో చెరువులు ఎండిపోవడంతో కొద్దిపాటి నీరు ఉంటే పొలాలు, కుంటలను ఆశ్రయించిన చేపలు.. తొలకరి జల్లలులతో మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో ఏపీ ప్రజలు ఉక్కబోత నుంచి ఉపశమనం పొందారు. అదే సమయంలో కోనసీమ జిల్లాలోని ఠాణేలంక గ్రామంలో అరుదైన దృశ్యం ఇప్పుడు ఆకట్టుకుంటుంది. చుట్టుపక్కల చేల నుండి, చిన్న చిన్న గుంతల నుండి చేపలు పెద్ద సంఖ్యలో చెరువుల్లోకి వలస వస్తున్నాయి!
నిజానికి.. ఈ చేపల వలస ఒక వింతైన దృశ్యం…ఎప్పుడూ బురదలోనో, చిన్న నీటి గుంటల్లోనో ఉండే ఈ చిన్న చేపలు, వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి.. ఇప్పుడు విశాలమైన చెరువులో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇది చూస్తుంటే…చిన్న చేపకు పెద్ద చెరువు దక్కినట్లుంది.. అని సామెత గుర్తుకు రాక మానదు. కొంతమంది గ్రామస్తులు దీన్ని ప్రకృతి సహజమైన ప్రక్రియగా భావిస్తుంటే, మరికొందరు మాత్రం సరదాగా కామెంట్లు చేస్తున్నారు. “ఇదిగో చూడండి, మన ఊరి చేపలకు కూడా హాలిడే మూడ్ వచ్చింది. పొలాల్లో కష్టపడి అలసిపోయి, ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి చెరువుకు వెళ్తున్నాయి….అని ఒక పెద్దాయన నవ్వుతూ అన్నారు. ఏదేమైనా, ఈ చేపల వలస మాత్రం ఠాణేలంక గ్రామస్తులకు ఒక మంచి వినోదాన్ని పంచుతోంది. వర్షపు నీటితో నిండిన చెరువులు, వాటిలో స్వేచ్ఛగా తిరుగుతున్న చేపలు ఈ దృశ్యం నిజంగా కనువిందు చేస్తుంది. అయితే, ఈ చేపలు ఎంతకాలం ఈ చెరువుల్లో ఉంటాయో, మళ్ళీ ఎప్పుడు వాటి స్వస్థలాలకు తిరిగి వెళ్తాయో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..