
చెల్లి పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగా కన్నతండ్రినే కొడుకు తలను గోడకేసి కొట్టడంతో పాటు చాకుతో పీక కోసి హత్య చేశాడు. ఈ అమానవీయ ఘటన రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలోని తొర్రేడు గ్రామానికి చెందిన వడిశెల అప్పారావు(49) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
కుమారుడు సాయికుమార్(26) చదువుకోలేదు. ఓ ప్లంబింగ్ దుకాణంలో పనిచేస్తున్నాడు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండో కుమార్తెకు సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ పెళ్లి సంబంధం రావడంతో దానికి ఇవ్వలేమంటూ చెప్పడంతో పెళ్లి ఆగిపోవడం జరిగింది. దీంతో కూతురు పెళ్లి వ్యవహారంపై ఇన్నాళ్ళంటూ వచ్చిన సంబంధాలను చెడగొడుతున్నావా అంటూ తండ్రికి, కుమారుడికి మనస్పర్ధలు వచ్చాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరోసారి గొడవ జరిగింది.
విపరీతమైన ఆవేశంతో సాయికుమార్ తండ్రి తలను గోడకేసి కొట్టాడు. అడ్డుకోబోయిన తల్లి వెంకటలక్ష్మిని, సోదరి ప్రశాంతిని గదిలోకి నెట్టి తలుపు గడియ వేశాడు. ఆవేశం చల్లారకపోవడంతో ఉల్లిపాయలు కోసే చాకుతో తండ్రి పీక కోసి హత్య చేశాడు. తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు.