ఏలూరు రైతు రాంబాబు సాగు సీక్రెట్ : వంగ సాగుతో అద్భుత లాభాలు

ఏలూరు జిల్లా రైతు రాంబాబు కూరగాయల సాగులో శాస్త్రీయ పద్ధతులు, సమగ్ర యాజమాన్యం పాటిస్తూ అద్భుతమైన లాభాలు ఆర్జిస్తున్నారు. వంగ, బెండ సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటూ, పలువురికి ఉపాధి కల్పిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన కష్టానికి, తెలివైన సాగు విధానానికి నిదర్శనం.

ఏలూరు రైతు రాంబాబు సాగు సీక్రెట్ : వంగ సాగుతో అద్భుత లాభాలు
Brinjal Farming

Updated on: Aug 21, 2026 | 7:40 AM

సాధారణంగా కూరగాయల సాగు అంటే ఖర్చులు ఎక్కువ, కష్టాలు ఎక్కువ, లాభాలు తక్కువ అనే అపోహ చాలా మంది రైతుల్లో ఉంటుంది. అయితే, ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతు రాంబాబు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశారు. గత 15 సంవత్సరాలుగా కూరగాయల సాగును నమ్ముకుని, శాస్త్రీయ పద్ధతులను అందిపుచ్చుకుంటూ, సమగ్ర యాజమాన్య విధానాలను పాటిస్తూ అద్భుతమైన లాభాలను ఆర్జిస్తున్నారు. తనకే కాకుండా, పదుల సంఖ్యలో స్థానిక కూలీలకు ఉపాధి కల్పిస్తూ విజయవంతమైన రైతుగా రాంబాబు గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాంబాబు మూడు ఎకరాల్లో వంగను, మరో అరవై సెంట్లలో బెండను సాగు చేస్తున్నారు. పంట సాగులో కేవలం విత్తనం వేయడంతోనే సరిపెట్టకుండా, నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం, చీడపీడల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నీటిని వృథా చేయకుండా డ్రిప్ పద్ధతి ద్వారా అందిస్తారు. అదే డ్రిప్ వ్యవస్థ ద్వారా పంటకు అవసరమైన సూక్ష్మ పోషకాలను కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ పంట ఎదుగుదలకు తోడ్పడతారు. కూరగాయ పంటల్లో చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుందని గుర్తించిన రాంబాబు, ముందస్తు జాగ్రత్తలకు ప్రాధాన్యమిస్తారు. పంటను నిత్యం పరిశీలిస్తూ, చీడపీడల ఉనికిని గుర్తించి, అవసరానికి అనుగుణంగా నివారణ చర్యలు చేపడతారు. వారానికి ఒకసారి తప్పనిసరిగా ఏదో ఒక మందును పిచికారీ చేస్తూ పంట ఆరోగ్యాన్ని కాపాడతారు.

రాంబాబు వంగ సాగులో విజేత రకాన్ని ఎంచుకున్నారు. ఈ మొక్కలను నర్సరీల నుండి ఒక్క రూపాయికి కొనుగోలు చేసి నాటారు. ఈ రకం అధిక దిగుబడిని ఇస్తుందని, ఎకరానికి రెండు నుంచి మూడు టన్నుల దిగుబడిని ప్రతి కోతకు అందిస్తుందని తెలిపారు. ఐదు నుంచి ఆరు రోజుల వ్యవధిలో కోతలు చేస్తారు. బెండలో అంకుర్ రకాన్ని సాగు చేస్తున్నారు, ఇది కూడా మంచి దిగుబడిని ఇస్తుందని, ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడిని అందిస్తుందని వివరించారు. కూరగాయ పంటలకు ఎకరానికి దాదాపు లక్ష రూపాయల పెట్టుబడి అవుతుందని, ఇందులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా వంటి ఎరువులతో పాటు కాంప్లెక్స్ ఎరువులు కూడా వాడతారని తెలిపారు. వంకాయ 60 నుంచి 65 రోజుల్లో కోతకు వస్తుండగా, బెండకాయ 70 రోజుల్లో కోతకు వస్తుందని చెప్పారు. పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ కూడా ఎంతో కీలకం అని రాంబాబు అంటారు. పండించిన కూరగాయలను స్థానిక చింతలపూడి మార్కెట్లో విక్రయిస్తారు. మార్కెట్ ధరలు బాగున్నప్పుడు మంచి లాభాలు వస్తాయని, పది రోజులు మార్కెట్ ధర తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతాయని, కాబట్టి నష్టపోయే అవకాశం తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. మొక్కజొన్న వంటి సాంప్రదాయ పంటల కంటే కూరగాయల సాగు చాలా సుఖమైనదని, రైతు కష్టపడితే చేసుకున్నంత పంట ఉంటుందని రాంబాబు అన్నారు. తన పొలంలో పని చేసే కూలీలకు రోజుకు 300 రూపాయల చొప్పున చెల్లిస్తూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేయించుకుంటారు. శాస్త్రీయ పద్ధతులు, కష్టంతో కూడిన కృషి తోడైతే వ్యవసాయం లాభాల బాట పడుతుందనడానికి రైతు రాంబాబు నిదర్శనం. పంటను మాత్రమే కాకుండా లాభాలను, పలువురికి ఉపాధిని పండిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us