
నకలి పోలీస్ అవతారమెత్తి పోలీసులకు అడ్డంగా బుక్కైన ఇతని పేరు చెల్లుబోయిన లోచన్ కుమార్. విశాఖలో ఉంటూ అక్కడి పోలీసులకే మస్కా కొట్టి తానను తాను కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకే డిఎస్పి నంటూ ఫేక్ పబ్లిసిటీ చేసుకొని నమ్మినవారికి నట్టేట ముంచేశాడు. ఇలానే ఓ యువతికి ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఏకంగా రూ.10 లక్షలు లాగేశాడు. ఇలా గత కొంతకాలంగా పోలీస్‌గా చలామణి అయిపోతున్న లోచన్ అవకాశం వచ్చినప్పుడు వాకి టాకీ పట్టుకొని ఫోటోలు దిగడం, పోలీసు వాహనాల వద్ద ఫోజులు ఇవ్వడం.. ఆ ఫోటోలను స్టేటస్ లో డిపిలో పెట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేయడం చేశాడు. అందరినీ తాను నిజమైన పోలీస్‌నని నమ్మించాడు.
ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని..
అంతటితో ఆగని ఈ లోచన కుమార్.. పోలీసు అధికారులకే కంగు తినిపించే పని చేశాడు. ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ పరీక్షల్లో సత్తా చాటానంటూ ప్రచారాలు చేశాడు. పోలీస్ శాఖలో డిఎస్పీగా పనిచేస్తున్నానని బిల్డప్ ఇచ్చాడు. ఇలా ఫోర్త్ టౌన్ పరిధిలో.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా ఓ యువతని మాయమాటల్లో దింపాడు. తనకు పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల పరిచయం ఉందని.. ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమెను లక్షల రూపాయలు కాజేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడం అతని అసలు బండారం బయటపడింది.
ప్రచారం మామూలుగా లేదుగా
పోలీస్ కావాలన్నా తన తండ్రి కల నెరవేరకపోవడంతో తాను డీఎస్పీ అవుతున్నానని ప్రచారం చేసినట్టు పోలీస్ విచారణలో లోచన్ అంగీకరించాడు. గతంలోనూ మెరిట్ లిస్టులో తన పేరు ఉందని.. కొన్ని కారణాలతో ఉద్యోగానికి వెళ్లలేకపోయానని.. తనకు తెలిసిన వాళ్ళలో చాలామంది వద్ద బిల్డప్ ఇచ్చాడు. 2023 లోనే తనకు ఏపీఎస్పీలో ఆర్ఎస్ఐగా ఉద్యోగం వచ్చిందని.. ఆ తర్వాత ఒక వ్యక్తిని కాపాడబోయే సమయంలో చేతికి కూడా గాయమైందని.. అందుకే ఎస్సైను కాలేకపోయామని చెప్పుకొచ్చాడు. ఓ ఐఏఎస్ అకాడమీతో తనకు సంబంధాలు ఉన్నాయని.. ప్రకటనలు కూడా చేయించుకున్నాడని పోలీసులు అంటున్నారు.
పోలీసులకే క్లాస్ చెప్పేందుకు సిద్ధమై..
తనకున్న పరిచయాలతో పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని కలెక్షన్లు చేసాడు. ఇక మరో అడుగు ముందుకేసి నెల్లూరు డిటిసిలో గెస్ట్ ఫ్యాకల్టీ గా వెళ్లి పోలీసులకు క్లాస్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా ఎస్సై ఉద్యోగం పేరుతో మోసపోయిన యువతి పోలీసులను సంప్రదించేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో నెల్లూరు డిటిసికి చేరుకున్న ప్రత్యేక బృందం లోచన్‌ను అదుపులోకి తీసుకుంది.
అమ్మాయిలతో వీడియో కాల్స్ వైరల్..
బాధితుల్లో యువతులు, మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో యువతులతో వీడియో కాల్స్ మాట్లాడి రికార్డ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఒకానొక సమయంలో ఇతను ఏకంగా విశాఖ సిపి బాగ్చి దగ్గరకు వచ్చి.. ఏ ఆర్ శిక్షణ తీసుకుంటున్న పోలీసులతో పాటే ఫోటో కూడా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీపీ ఒక్కసారిగా అవ్వక్కయ్యారు.
మొత్తానికి నకిలీ డి.ఎస్.పి యవ్వారం బయటపడడంతో.. బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు అరా తీస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు ఇటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై కూపీ లాగుతున్నారు. ఉద్యోగం కష్టపడితే మాత్రమే వస్తుందని.. ఇలా అడ్డదారిలో ఉద్యోగం సంపాదించడం సాధ్యం కాదని.. ఇలాంటి మాటలు నమ్మ జనాలు మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.